జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్

6603 నాలుగో గ్రేడ్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో క్రమబద్ధీకరించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించాలని ఆదేశాలిచ్చింది.

Advertisement
Update:2023-09-17 07:00 IST

క్రమబద్ధీకరణకోసం వేచి చూస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 6603 నాలుగో గ్రేడ్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో క్రమబద్ధీకరించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించాలని ఆదేశాలిచ్చింది. మరో 3065 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో అర్హులైన జూనియర్ కార్యదర్శులను ఆయా పోస్టుల్లో నియమించే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలో 9355 మంది జేపీఎస్‌ లు పనిచేస్తున్నారు. ఇందులో 1000 మంది ఔట్ సోర్సింగ్ రూపంలో సేవలు అందిస్తున్నారు. 1739 మంది డీఎస్సీ ద్వారా ఎంపికైన వారు. ఇటీవల జేపీఎస్ లను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, నాలుగేళ్ల సర్వీసు నిబంధన విధించింది. దీంతో కొందరు రెగ్యులరైజేషన్ కు దూరమయ్యారు. 6616 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులుగా గుర్తించారు. వీరికోసం ప్రభుత్వం 6603 నాలుగో గ్రేడ్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసింది. మిగిలిన 13మందిని శాఖాపరంగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేస్తామని తెలిపింది.

నిరాశపడొద్దు..

నాలుగేళ్ల నిబంధనతో జేపీఎస్ లు నిరాశపడిన విషయం తెలిసిందే. అయితే వారి భవిష్యత్ కి ఎలాంటి బెంగలేదని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. 3065 ఖాళీ పోస్టులు ఉన్నాయని, మిగిలిన వారికి క్రమబద్ధీకరణ ద్వారా నాలుగో గ్రేడ్‌ పంచాయతీ కార్యదర్శులుగా నియామకాలు పొందే వీలుందని తెలిపింది. 

Tags:    
Advertisement

Similar News