నేతన్నలకు బకాయిలు విడుదల.. కానీ..!

నేత కార్మికులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలే రూ.351 కోట్లు అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు తాము మాత్రం రూ.50 కోట్లు విడుదల చేసి సరిపెట్టారు.

Advertisement
Update:2024-04-20 08:04 IST

తెలంగాణలో ఇటీవల నేతన్నల బకాయిల విషయం రాజకీయ రచ్చగా మారింది. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ వల్లే వస్త్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడిందని బీఆర్ఎస్ ప్రతి విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇవ్వాల్సింది కొండంత..

నేత కార్మికులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలే రూ.351 కోట్లు అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు తాము మాత్రం రూ.50 కోట్లు విడుదల చేసి సరిపెట్టారు. అయితే కొంతలో కొంత ఇది ఊరట అనే చెప్పాలి. మిగతా బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అంటున్నారు నేత కార్మికులు. ఆర్థిక వెసులుబాటు చూసుకుని మిగతా బకాయిలు క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇకపై బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫాంల తయారీకి సుమారు రూ. 47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్‌కు రూ. 14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి రూ.50 కోట్లు చెల్లింపుకోసం తాజాగా నిర్ణయం తీసుకుంది. మొత్తమ్మీద నేతన్నల కష్టాలకు తాత్కాలిక ఉపశమనం లభించినట్టయింది. 

Tags:    
Advertisement

Similar News