కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు.. పెన్షన్ల రికవరీ నిలిపివేత

కేటీఆర్ ట్వీట్ తో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పెన్షన్ల రికవరీ ఆపేయాలంటూ సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Update:2024-07-15 06:53 IST

తెలంగాణలో ఓ వృద్ధురాలి నుంచి సామాజిక పెన్షన్ ని రికవరీ చేస్తామంటూ ఇటీవల ప్రభుత్వం నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ వేశారు. కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడినట్టయిందని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభుత్వం.. కొత్త పథకాలు ఇస్తుందని, ఉన్న పథకాలకు ఆర్థిక సాయం పెంచుతుందని ప్రజలు ఆశించారని, కానీ ఉన్న పెన్షన్లు రికవరీ చేస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. ఇది అమానవీయ ఘటన అని అండిపడ్డారు కేటీఆర్. కేటీఆర్ ట్వీట్ తో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పెన్షన్ల రికవరీని ఆపేయాలంటూ సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు కొన్నాళ్లుగా ఆసరా పెన్షన్ తీసుకుంటోంది. ఆమె కుమార్తె వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ చనిపోవడంతో.. తల్లి మల్లమ్మకు డిపెండెంట్ పెన్షన్ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఒకే వ్యక్తి రెండు పెన్షన్లు తీసుకోవడం సరికాదంటూ ఇటీవల ప్రభుత్వం ఆమెకు నోటీసులిచ్చింది. ఆసరా పెన్షన్ కింద ఆమె ఇప్పటి వరకు తీసుకున్న లక్షా 72 వేల రూపాయలను తిరిగివ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలి పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని ప్రతిపక్షం ధ్వజమెత్తింది. ఇది అమానవీయ చర్య అంటూ కేటీఆర్ ట్వీట్ వేశారు. దీంతో నోటీసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.


సంక్షేమ పథకాల విషయంలో అనర్హులకు లబ్ధి, రికవరీలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారని సీఎస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారామె. తదుపరి మార్గదర్శకాలు ఇచ్చే వరకు ఇంకెవరికీ రికవరీ నోటీసులు జారీ చేయొద్దని సూచించారు సీఎస్.

Tags:    
Advertisement

Similar News