గవర్నర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

గవర్నర్ తమిళిసై నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ హైకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement
Update:2023-01-30 09:23 IST

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై గత కొంత కాలంగా సహకరించడం లేదు. అనేక బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం పంపగా.. ఇంకా అవి రాజ్ భవన్‌లోనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అనుమతి కోరగా.. గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే గవర్నర్ నుంచి ముందుగా ఆమోదం రావల్సి ఉంటుంది. దీంతో 10 రోజుల క్రితమే బడ్జెట్ సమావేశాల కోసం సమాచారం పంపారు. అయినా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

గవర్నర్ తమిళిసై నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ హైకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నది. ఆర్థిక బిల్లు, వార్షిక ద్రవ్య వినియోగ పత్రాలు సభలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ముందుగా ఆమోదం తెలపాలి. సమావేశాలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. గవర్నర్ ఆమోదం లేకుండా సభలో ప్రవేశ పెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు ఒప్పుకోవు. దీంతో న్యాయపోరాటానికి దిగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

బీజేపీయేతర రాష్ట్రాల్లోని గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలకు సహకరించడం లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దల సూచనల మేరకే గవర్నర్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి కూడా గవర్నర్ల నుంచి సహకారం ఉండటం లేదు. కేరళలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొన్నది. తాజాగా, తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

రాజ్యాంగంలోని 207ఆర్టికల్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే ఏ బిల్లు అయినా కన్సాలిడేటెడ్ ఫండ్ వ్యవహారంతో ముడిపడి ఉంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. గవర్నర్ అనుమతించకుండా అసెంబ్లీ/కౌన్సిల్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందకూడదు. ఆ బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని గవర్నర్ సిఫార్సు చేసిన తర్వాతే చట్ట సభల్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్‌కు సంబంధించిన బిల్లు కూడా కన్సాలిడేటెడ్ ఫండ్‌తో లింక్ అయి ఉన్నది. కాబట్టి గవర్నర్ అనుమతించకుండా ప్రవేశపెట్టడానికి వీలుండదు. అసలు బిల్లు ప్రవేశపెట్టడానికే వీలు లేనప్పుడు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం కూడా ఉండదు. ఇవాళ వేసే లంచ్ మోషన్ పిటిషన్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News