కరీంనగర్‌కు అమెరికా సంస్థ.. ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం
హెల్త్ కేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొల్యూషన్స్ సంయుక్తంగా కరీంనగర్‌లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి.
అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ప్రముఖ సంస్థల యాజమాన్యాలతో భేటీ అవుతూ.. తెలంగాణకు పెట్టుబడులు తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇక ఇప్పుడు కరీంనగర్‌కు కూడా అమెరికా సంస్థలు రాబోతున్నాయి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని టైర్-2 సిటీస్‌లో కూడా అంతర్జాతీయ సంస్థలు ఉండాలనే లక్ష్యంలో భాగంగా తాజాగా ఒక ఒప్పందం జరిగింది.
హెల్త్ కేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొల్యూషన్స్ సంయుక్తంగా కరీంనగర్‌లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. వాషింగ్టన్ డీసీలో 3ఎం, ఈసీఎల్ఏటీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కరీంనగర్‌లో మెడికల్ కోడింగ్, క్లినికల్ డాక్యుమెంటేషన్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న ఈ డాటా సెంటర్‌లో 100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాబోయే కాలంలో ఉద్యోగుల సంఖ్య 200 వరకు పెంచనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్‌లో జాప్‌కామ్ సెంటర్..
అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజనీరింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూప్.. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. వాషింగ్టన్ డీసీలో జాప్‌కాప్ వ్యవస్థాపకుడు, సీఈవో కిషోర్ పల్లమ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న సెంటర్‌పై అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక్కడ ఏర్పాటు చేయునున్న సెంటర్‌లో తొలుత 500 మందికి ఉద్యోగాలు లభించనున్నారు. ఏడాది లోగా మరో 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్, రిటైల్ రంగాల్లో ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్పత్తులను జాప్‌కామ్ అందిస్తోంది.