తెలంగాణ అవతరణోత్సవాలు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

కార్యక్రమాల ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు.. సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో జూన్ 2న ఉదయం రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని వారు తెలిపారు.

Advertisement
Update:2024-05-27 21:57 IST

తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. తమ ఆధ్వర్యంలో తొలిసారిగా తెలంగాణ అవతరణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఏడాది దశాబ్ది ముగింపు ఉత్సవాలు జరగాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దశాబ్ది అనే పదం లేకుండా కేవలం అవతరణ ఉత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటోంది. ఈ ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.


కార్యక్రమాలు ఇలా..

జూన్ 2న ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులుబాసిన అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు.. సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో జూన్ 2న ఉదయం రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని వారు తెలిపారు.

ట్యాంక్ బండ్ పై.

ట్యాంక్ బండ్‌పై సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్దఎత్తున కార్నివాల్ నిర్వహించబోతున్నట్టు సీఎస్ వివరించారు. శిక్షణ పొందుతున్న 5000మంది పోలీస్ అధికారులు బ్యాండ్ ప్రదర్శన ఇస్తారని చెప్పారు. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80స్టాళ్లను ఏర్పాటు చేసి హస్త కళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన పలు వస్తువులలతోపాటు నగరంలోని పేరొందిన హోటళ్లచే ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లల కోసం పలు క్రీడలతో కూడిన వినోదశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బాణసంచా ప్రదర్శన, లేజర్ షో ఉంటుందన్నారు. ట్యాంక్ బండ్‌పై జరిగే ఉత్సవాలకోసం పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు అధికారులు. వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 

Tags:    
Advertisement

Similar News