రైతు వేదికల వద్ద కాంగ్రెస్ కి శాపనార్థాలు
ఈరోజుతో మొదలైన తీర్మానాల కార్యక్రమం 10రోజుల పాటు కొనసాగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ఇదివరకే పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఈరోజు కాంగ్రెస్ కి శాపనార్థాలు పెట్టారు అన్నదాతలు. రైతులకు 3 గంటల విద్యుత్ చాలంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ విధానంపై కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారని, నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ, జనగామ జిల్లాలోని రైతు వేదికల వద్ద జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని రైతు వేదికల వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. జిల్లా రైతుబంధు సమితి నాయకులు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి వైఖరిపై రైతులు నిప్పులు చెరిగారు. కేసీఆర్ నాయకత్వంలోనే రైతాంగం కష్టాలు తీరాయని అన్నారు.
నందిగామ మండలం రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అన్నదాతలు తీర్మానం చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగురామన్న.. రైతు వేదికల వద్ద సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ వైఖరి ఎండగట్టారు.
ఈరోజుతో మొదలైన తీర్మానాల కార్యక్రమం 10రోజుల పాటు కొనసాగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ఇదివరకే పిలుపునిచ్చారు. తొలిరోజు చాలా చోట్ల రైతు వేదికల వద్ద కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు.