బీఆర్ఎస్ పరిహార పూజలు.. శుద్ధి చేసిన కాంగ్రెస్ శ్రేణులు
రుణ మాఫీ అంశం యాదాద్రిపై రచ్చగా మారడం విశేషం. అక్కడ హరీష్ రావు పరిహార పూజలు చేయగా, అనంతరం కాంగ్రెస్ నేతలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాజకీయాల్లో కాసేపు యాదాద్రి ఆలయం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టి మరీ ప్రజల్ని మోసం చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపంగా మారకూడదని, ఆ విషయంలో ప్రజల్ని ఆ దేవుళ్లే రక్షించాలని కోరుతూ హరీష్ రావు యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రిలోని తూర్పు రాజగోపురం వద్ద పాప పరిహార పూజలు నిర్వహించారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఏయే దేవుళ్లపై ఒట్లు పెట్టారో.. ఆయా ఆలయాలన్నిటికీ వెళ్లి పూజలు చేస్తామన్నారు హరీష్ రావు.
ఇక హరీష్ రావు పరిహార పూజల్ని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఆయన రాకతో యాదాద్రి అపవిత్రం అయిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఆలయ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్టపై ఆలయ పరిసరాలను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నీటితో కడిగారు. వాటర్ ట్యాంకర్ తో తెచ్చిన నీటిని పోస్తూ చీపుర్లతో మాడ వీధుల్ని శుభ్రం చేశారు.
మొత్తానికి రుణ మాఫీ అంశం యాదాద్రిపై రచ్చగా మారడం విశేషం. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ నేతలు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. పూర్తిగా రుణమాఫీ కాలేదని నేతలే ఒప్పుకుంటున్నారు. కొంతమంది రైతులు తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కారు. కాంగ్రెస్ నేతలు అన్నదాతలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు.