ఫస్ట్ లిస్ట్ వచ్చేస్తోందా?

ప్రచార కమిటీ చైర్మ‌న్ మధుయాష్కి మీడియాకు చెప్పిన ప్రకారం మొత్తం అభ్యర్థుల్లో 80 శాతం పేర్లతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా రెడీ అవబోతోంది. ఆ జాబితాను వచ్చే నెలలో రిలీజ్ చేయటానికి కసరత్తు జరుగుతోందట.

Advertisement
Update: 2023-08-05 05:51 GMT

వచ్చే నెలలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో మొదటి లిస్ట్ రిలీజ్ కాబోతోంది. అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. తర్వాత ఆ వివరాలను ప్రచార కమిటీ చైర్మ‌న్ మధుయాష్కి మీడియాకు వివరించారు. యాష్కి చెప్పిన ప్రకారం మొత్తం అభ్యర్థుల్లో 80 శాతం పేర్లతో మొదటి జాబితా రెడీ అవబోతోంది. ఆ జాబితాను వచ్చే నెలలో రిలీజ్ చేయటానికి కసరత్తు జరుగుతోందట. అభ్యర్థుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీదే ఫైనల్ నిర్ణయమని యాష్కి చెప్పారు.

మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80 శాతం అంటే 95 సీట్లు. మరి నిజంగానే 95 సీట్లతో మొదటి జాబితా రిలీజ్ చేయగలుగుతుందా అన్నదే సందేహంగా మారింది. అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించటం వల్ల ఉపయోగం ఉంటుందని యాష్కి ప్రకటించింది వాస్తవమే. ఈ విషయంలో కర్నాటక మోడల్‌ను తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఇంతవరకు ఎలాంటి వివాదంలేదు. కాకపోతే 95 సీట్లలో అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటిస్తామని చెప్పటమే కొంచెం అనుమానంగా ఉంది.

సిట్టింగులు లేకపోతే పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళ నియోజకవర్గాల్లో టికెట్ కోసం పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. అలాంటి నియోజకవర్గాలు మహా అయితే ఓ 30 ఉంటాయేమో. మరి మిగిలిన నియోజకవర్గాల మాటేమిటి? చాలా నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఇద్దరికి మించిన నేతల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే గ్రూపుల గోలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరికి టికెటిచ్చినా మిగిలిన నేతలు పూర్తిగా వ్యతిరేకమవుతారు. సరే ఈ పద్ధ‌తి ఇప్పుడు అన్నీ పార్టీల్లో వచ్చేసినా కాంగ్రెస్‌లో చాలా ఎక్కువగా ఉంది.

పైగా అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిని కూడా కాదని డైరెక్ట్‌గా ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో మాట్లాడుకునేంత స్వేచ్ఛ‌ సీనియర్లలో చాలామందికి ఉంది. తమకున్న పరిచయాలు, పలుకుబడితో పీసీసీ స్థాయిలో టికెట్‌కు రికమెండేషన్ జరగకపోయినా నేరుగా ఢిల్లీలో మాట్లాడుకుని టికెట్ తెచ్చుకోవటం కాంగ్రెస్‌లో మామూలే. ఇవన్నీ మధుయాష్కీకి తెలీవని అనుకునేందుకు లేదు. ఎందుకంటే మొదట్లో యాష్కీ కూడా ఇలా అవస్థ‌లుపడిన నేతే. ఏదేమైనా 80 శాతం టికెట్లు వచ్చే నెలలో ప్రకటించేస్తామని చెప్పటం పెద్ద సాహసమనే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News