అభ్యర్థుల నేర చరిత్ర.. ఆ పార్టీనే టాప్‌..!

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల తరఫున 360 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వీరిలో 226 మంది అభ్యర్థులపై నేర చరిత్ర ఉన్నట్లు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ తేల్చింది.

Advertisement
Update:2023-11-22 07:57 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 62 శాతం నేర చరిత్ర కలిగినవారేనని స్పష్టం చేసింది ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ. ఎన్నికల కోసం అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నేరచరిత్రను వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను మాత్రమే ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పరిగణలోకి తీసుకుంది.

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల తరఫున 360 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వీరిలో 226 మంది అభ్యర్థులపై నేర చరిత్ర ఉన్నట్లు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ తేల్చింది. అన్ని పార్టీలు నేరచరిత్ర ఉన్న వారికే టికెట్లు కేటాయించాయని స్పష్టం చేసింది.




బీఆర్ఎస్‌లో 58 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అత్యధికంగా మంత్రి గంగుల కమలాకర్‌పై 10, కేసీఆర్‌పై 9, కేటీఆర్‌పై 8 కేసులున్నాయి. మహిళా అభ్యర్థులు సునీతా లక్ష్మారెడ్డిపై 5, సబితా ఇంద్రారెడ్డిపై 5 క్రిమినల్ కేసులున్నాయి.

ఇక కాంగ్రెస్‌లో 84 మంది అభ్యర్థులు నేరచరిత్ర కలిగినవారే. వీరిలో అత్యధికంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై 89 కేసులుండగా.. వెడ్మా బొజ్జు 52, ప్రేమ్‌సాగర్‌ రావు 32, పురుమల్ల శ్రీనివాస్ 24 కేసులు ఎదుర్కొంటున్నారు.

బీజేపీలో 78 మంది క్రిమినల్ కేసులున్నవారే. వీరిలో అత్యధికంగా రాజాసింగ్‌పై 89 కేసులున్నాయి. తర్వాత బండి సంజయ్‌ 59, సోయం బాపురావు 55, ఈటల రాజేందర్ 40, రఘునందన్‌రావుపై 27 కేసులున్నాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ తేల్చింది. ఇక MIMలో ఆరుగురు అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అత్యధికంగా అక్బరుద్దీన్ ఓవైసీ 6 క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు.

పార్టీల వారీగా చూసుకుంటే నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్‌ టాప్‌లో ఉంది. దాదాపు 71 శాతం కాంగ్రెస్‌ అభ్యర్థులపై కేసులున్నాయి. తర్వాత బీజేపీ అభ్యర్థుల్లో 70 శాతం, బీఆర్ఎస్‌ అభ్యర్థుల్లో 50 శాతం అభ్యర్థులపై కేసులున్నాయి.

Tags:    
Advertisement

Similar News