కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ అప్పుడే.. ఆలస్యానికి కారణం ఏంటంటే..?
రాబోయే రోజుల్లో బీజేపీకి చెందిన 30 మంది కీలక నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి వస్తారని తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. అన్నీ కుదిరితే అక్టోబర్ 9న అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి. BJP, BRS అసంతృప్త నేతల చేరిక కోసం కాంగ్రెస్ వేచి చూసే ధోరణిలో ఉంది. మరోవైపు లెఫ్ట్, తెలంగాణ జనసమితి, బీఎస్పీ లాంటి పార్టీలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని తెలిపాయి పార్టీ వర్గాలు. అభ్యర్థుల జాబితా విడుదల ఆలస్యానికి ఇదే కారణమంటున్నారు కాంగ్రెస్ నేతలు.
ఆగస్టు 18 నుంచి 25 మధ్య ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్. దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కలిపి 1016 మంది దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారికే టికెట్లు ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. అయితే బీఆర్ఎస్, బీజేపీలో అసమ్మతి కారణంగా చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
రాబోయే రోజుల్లో బీజేపీకి చెందిన 30 మంది కీలక నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి వస్తారని తెలుస్తోంది. వీరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖా నాయక్, బేతి సుభాష్ రెడ్డి, టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి టికెట్ హామీ లభిస్తే కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక పొత్తులపై చర్చలు జరిపే బాధ్యతను సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ లీడర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల పూర్తి జాబితాను ఒకేసారి రిలీజ్ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇక అసంతృప్తులకు నామినేటెడ్ పోస్టుల ఆశ చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది.