తెలంగాణ కాంగ్రెస్ ఐక్యతారాగం.. కోమటిరెడ్డి ఇంట్లో సమావేశం

అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకెళ్లాలని వారు తీర్మానించారు. అదే సమయంలో ఉచిత విద్యుత్ లాంటి వ్యవహారంలో మరోసారి తప్పులు దొర్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Update:2023-07-19 19:47 IST

తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యతారాగం వినిపించింది. అది కూడా నిత్య అసమ్మతి నేతగా పేరున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పొన్నాల లక్ష్మయ్య, సంపత్‌ కుమార్‌ తో పాటు పలువురు ముఖ్య నేతలు కోమటిరెడ్డి ఇంట్లో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకెళ్లాలని వారు తీర్మానించారు. అదే సమయంలో ఉచిత విద్యుత్ లాంటి వ్యవహారంలో మరోసారి తప్పులు దొర్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.

విభేదాలన్నీ పక్కనపెడదాం..

ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కూడా కలసి కట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించారు నేతలు. అందుకే కోమటిరెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టారు. పార్టీలో చేరికలు, అగ్రనేతల పర్యటన, ఎన్నికల హామీలు, ప్రచార అంశాలపై సమాలోచన జరిపినట్టు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చినా రైతులెవరూ ముందుకు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 8గంటలు మించి ఉచిత విద్యుత్‌ ఇవ్వట్లేదని, తాను సబ్‌ స్టేషన్లలో లాగ్‌బుక్స్‌ తీసి నిలదీశాక కొంచెం ఎక్కువ సేపు కరెంటు ఇస్తున్నారని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

తెలంగాణలో దళితబంధు, బీసీ బంధులో కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటూ బీఆర్ఎస్ హామీ ఇవ్వగలదా అని నిలదీశారు. ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ అందరి ఏకైక లక్ష్యమని, దానికోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని హస్తం పార్టీ నేతలు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News