టీకాంగ్ కి మరమ్మతులు.. మాణిక్ రావ్ ఠాక్రే ఎంట్రీ

గాంధీ భవన్ లో వరుస సమావేశాలు మొదలయ్యాయి. ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం తర్వాత పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అవుతారు ఠాక్రే. రాత్రి ఏడుగంటలకు పీఏసీ సభ్యుల సమావేశం ఉంటుంది.

Advertisement
Update:2023-01-11 11:43 IST

తెలంగాణలో రోజు రోజుకీ దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని గాడిన పెట్టేందుకు అధిష్టానం మాణిక్ రావ్ ఠాక్రేని ఇన్ చార్జ్ గా నియమించింది. గతంలో పనిచేసిన మాణిక్కం ఠాగూర్ కి సీనియర్లు షాకివ్వడం, సహాయ నిరాకరణ చేయడంతో అధిష్టానం ఠాక్రేని తీసుకొచ్చి, ఠాగూర్ ని గోవాకి సాగనంపింది. ఈ క్రమంలో టీకాంగ్రెస్ కి మరమ్మతులు చేసేందుకు, పార్టీని గాడిన పెట్టేందుకు మాణిక్ రావ్ ఠాక్రే తొలిసారిగా హైదరాబాద్ కి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రెండు రోజులపాటు పార్టీ నాయకులతో సమావేశాలు, సమీక్షలతో ఆయన బిజీ బిజీగా గడపబోతున్నారు.


గాంధీ భవన్ లో వరుస సమావేశాలు మొదలయ్యాయి. ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం తర్వాత పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అవుతారు ఠాక్రే. రాత్రి ఏడుగంటలకు పీఏసీ సభ్యుల సమావేశం ఉంటుంది. రేపు డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల నేతలతో ఠాక్రే సమావేశం అవుతారు. తొలి పర్యటనలో ఆయన సీనియర్లను బుజ్జగించే అవకాశముంది.

కోమటిరెడ్డి సంగతేంటి..?

సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కి స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు. ఎన్నికలకోసం పనిచేయరు, నాయకుల్ని విమర్శిస్తారు, కలసి కార్యక్రమాల్లో పాల్గొనరు, అలాగని పార్టీని వదిలిపెట్టేందుకు ఇష్టపడరు. ఈ దశలో కోమటిరెడ్డి వ్యవహారాన్ని కూడా ఠాక్రే తేల్చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి గాంధీ భవన్ కు ఆహ్వానించారు. అయితే ఆయన్ను గాంధీ భవన్ బయట కలుస్తానని కోమటి రెడ్డి సమాధానమిచ్చినట్టు తెలుస్తంది.

ఉప ఎన్నికలు జరిగినప్పుడల్లా కాంగ్రెస్ పతనం స్పష్టంగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పూర్తిగా పట్టు కోల్పోయింది. టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలన్నా, అధికారం సంగతి పక్కనపెడితే.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలన్నా కూడా కాంగ్రెస్ కి కష్టమని తేలిపోయింది. ఈ దశలో ఠాక్రే, రేవంత్ రెడ్డి జోడీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, తెలంగాణలో ఉనికి ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News