తెలంగాణకు మళ్లీ ప్రియాంక, రాహుల్.. నలుగురు సీఎంలు కూడా
రాహుల్, ప్రియాంకతోపాటు కర్నాటక, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతోనూ తెలంగాణలో ప్రచారం చేయించాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారాన్ని ఉధృతం చేయాలనుకుంటోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కష్టపడుతున్న రాహుల్, ప్రియాంక.. ఇప్పటికే ఓ దఫా తెలంగాణ వచ్చి వెళ్లారు. ఆ పర్యటనలో వారిద్దరూ కలసి యాత్రల్లో పాల్గొన్నారు. ఇప్పుడు విడివిడిగా బహిరంగ సభలకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో ఆ పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారు.
ఈ నెల 28న కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో తెలంగాణలో రెండో విడత బస్సుయాత్ర ప్రారంభించాలని చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రెండు రోజులపాటు సిద్ధరామయ్య ఈ యాత్ర చేపడతారు, ఆ తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 30వ తేదీన యాత్రలో పాల్గొంటారు. ఈ నెల 31న కొల్లాపూర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు చేరికల సభకు రావాల్సిన ప్రియాంక.. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభకు రాబోతున్నారు.
నవంబర్ లో రాహుల్..
నవంబర్ 1, 2 తేదీల్లో రాహుల్‌గాంధీ మరోసారి బస్సుయాత్ర, రోడ్ షోలలో పాల్గొంటారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ తొలివిడత యాత్రకు మంచి స్పందన వచ్చిందని అంటున్న నేతలు.. ఈ యాత్రను కూడా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతోనూ రాష్ట్రంలో ప్రచారం చేయించాలని అనుకుంటున్నారు. సభలు, రోడ్ షోలకు రూట్ మ్యాప్ సిద్ధంచేస్తున్నారు. వచ్చేనెల 3 నుంచి నామినేషన్లు మొదలవుతాయి కాబట్టి.. ఆలోగా రెండో విడత బస్సుయాత్ర పూర్తి చేయాలనుకుంటున్నారు. నామినేషన్ల అనంతరం ప్రచారం స్పీడ్ మరింత పెంచుతామని చెబుతున్నారు.