మనిద్దరమే మాట్లాడుకుందాం.. చంద్రబాబుకు రేవంత్ లేఖ

ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే పాల్గొంటారని, అధికారులెవరూ పాల్గొనరని రేవంత్‌ రాసిన లేఖను బట్టి స్పష్టమవుతోంది. అయితే అధికారులు లేకుండా సమావేశం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement
Update:2024-07-02 21:16 IST

రాష్ట్ర విభజన తర్వాత పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చిద్దామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిగా చంద్రబాబుకు లేఖ రాశారు. సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈ నెల 6న మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌లో నిర్వహించే సమావేశానికి రావాలని చంద్రబాబును కోరారు.

ఇంతకీ రేవంత్ లేఖలో ఏముందంటే!

``మీ లేఖను చదివా.. మీ లేఖలో నా గురించి ప్రస్తావించిన విషయాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసినందుకు మీకు అభినందనలు. స్వతంత్ర భారతంలో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి అరుదైన ఘనతను సాధించారు. ఈ టర్మ్‌లోనూ సక్సెస్‌ కావాలని ఆకాంక్షిస్తున్నా. ముఖాముఖి భేటీ అవుదామన్న మీ ప్రతిపాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. విభజన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నా. పరస్పర సహకారం, ఆలోచనల బదిలీ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు దోహద పడుతుందని ఆశిస్తున్నా. ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా.. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఈ సమావేశం కీలకం. తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని ఈ నెల 6న మధ్యాహ్నం ప్రజా భవన్‌లో జరిగే సమావేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నా`` అని రేవంత్‌రెడ్డి చంద్ర‌బాబుకు లేఖ రాశారు.



కాగా, ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. అధికారులెవరూ పాల్గొనరని రేవంత్‌ రాసిన లేఖను బట్టి స్పష్టమవుతోంది. అయితే అధికారులు లేకుండా సమావేశం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలంటూ రేవంత్ రెడ్డికి సోమవారం చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పెండింగ్ సమస్యలపై చర్చిద్దామని లేఖలో కోరారు చంద్రబాబు.

Tags:    
Advertisement

Similar News