తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చినోళ్లు మావాళ్లే

తెలంగాణ ఇచ్చింది మేమే.. తెలంగాణ తెచ్చినోళ్లు మావాళ్లే అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు పార్లమెంట్ లో విభజన బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు పెప్పర్ స్ప్రే బారిన పడ్డది కూడా కాంగ్రెస్ ఎంపీలే అని వివరించారు.

Advertisement
Update:2024-02-17 14:44 IST

ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం మాటల యుద్ధానికి కారణం అయింది. తప్పంతా గత ప్రభుత్వానిదేనంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. అబద్ధాల శ్వేతపత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతోందని హరీష్ రావు బదులిచ్చారు. బురదజల్లడంమాని ప్రజా సంక్షేమం కోసం ఆలోచనలు చేయాలని హితవు పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం అంశంపై మాట్లాడారు. నీటిపారుదల ప్రాజెక్ట్ లపై గతంలో రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను ఆయన సభలో ప్రస్తావించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కళంకంగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని నమ్మి పదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారన్నారు. కూలిన ప్రాజెక్టును చూసి ప్రతిపక్షం సిగ్గుపడాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెదలు పట్టించారన్నారు. ఇంజినీర్లు చెప్పినచోట కాకుండా.. వారికి అనుకూలమైన చోట ప్రాజెక్ట్ నిర్మించారని, కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఇచ్చింది మేమే.. తెలంగాణ తెచ్చినోళ్లు మావాళ్లే అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు పార్లమెంట్ లో విభజన బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు పెప్పర్ స్ప్రే బారిన పడ్డది కూడా కాంగ్రెస్ ఎంపీలే అని వివరించారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రజలు నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే అభివృద్ధి చేయాల్సింది పోయి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. గతంలో చేసిన తప్పులను అంగీకరించి సలహాలు ఇస్తే కొంతమేరకైనా సమాజం అభినందించేదని, తప్పులు అంగీకరించకుండా అసెంబ్లీలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News