విద్య, ఉద్యోగం.. సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్ ఇదే

గతంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీ, కేసు ప్రస్తుత స్థితి గురించి పోలీస్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయ పోస్ట్ ల ఖాళీల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2023-12-13 08:58 IST

తెలంగాణలో విద్య, ఉపాధి రంగంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా TSPSC లీకేజీ వ్యవహారం అప్పట్లో ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీంతో కొత్త ప్రభుత్వంలో లోపాలు సరిదిద్దాలని ఫిక్స్ అయ్యారు సీఎం రేవంత్. TSPSC ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. UPSCతో పాటు ఇతర రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాలను పంపించి.. అక్కడ జరుగుతున్న నియామక ప్రక్రియపై అధ్యయనం చేయాలని చెప్పారు. TSPSC ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు జారీ చేసిన నిబంధనల మేరకు కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకాలు ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు. TSPSCకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

త్వరలో కొత్త బోర్డ్..

గవర్నర్ తమిళిసై అందుబాటులో లేకపోవడంతో TSPSC చైర్మన్ సహా ఇతర సభ్యుల రాజీనామాలు కాస్త ఆలస్యమయ్యాయి. ఆ రాజీనామాల తర్వాత కొత్త సభ్యుల నియామకం చేపడతారు. త్వరలోనే కొత్త బోర్డ్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇక గతంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీ, కేసు ప్రస్తుత స్థితి గురించి పోలీస్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే 108 మందిని అరెస్టు చేసింది. మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేయగా, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక తర్వాత రెండో చార్జి షీట్ దాఖలు చేయాల్సి ఉంది. సిట్‌ లోని అధికారులంతా ఎన్నికల కారణంగా బదిలీ కావడంతో ప్రస్తుతం కేసు విచారణ ముందుకు కదలడంలేదు. మరోవైపు ఎన్నికల కారణంగా వాయిదా పడిన పరీక్షల నిర్వహణకోసం కసరత్తులు జరుగుతున్నాయి. కొత్త బోర్డ్ నియామకం పూర్తయిన తర్వాత పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశముంది. కొత్త నోటిఫికేషన్లు కూడా అప్పుడే విడుదలయ్యే అవకాశముంది.

అటు విద్యాశాఖ అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సూచించారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ఇంటర్‌ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయ పోస్ట్ ల ఖాళీల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News