విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుక
తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం అమలుతీరు పరిశీలనకు ఇటీవలే తెలంగాణ అధికారుల బృందం వెళ్లి వచ్చింది. వారి నివేదిక పరిశీలించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్. త్వరలో తెలంగాణలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలులోకి రాబోతోంది. ఈ పథకం నిరుపేద కుటుంబాల పిల్లలకు మరింత ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు అధికారులు. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న మరో సాహసోపేత నిర్ణయంగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
దసరా కానుక..
ముఖ్యమంత్రి అల్పాహార పథకం తెలంగాణ వ్యాప్తంగా.. దసరా సందర్భంగా అక్టోబర్ 24 నుంచి అమలులోకి వస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. దసరా నుంచి వారికి ఉదయం అల్పాహారం కూడా ఉచితంగా అందిస్తారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం ప్రారంభించింది. ఇప్పుడు తెలంగాణ కూడా అల్పాహార పథకాన్ని అమలులోకి తెస్తోంది.
నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా ఈ పథకం సత్ఫలితాలు సాధిస్తుందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఉదయాన్నే వ్యవసాయ పనులు, కూలిపనులు చేసుకోవడానికి వెళ్లే తల్లిదండ్రులు, తమ పిల్లల విషయంలో ఇకపై కంగారు పడాల్సిన పనిలేదు. వారికి అల్పాహారం ప్రత్యేకంగా తయారు చేసి, హడావిడిగా పనులకు వెళ్లే ఇబ్బంది వారికి తప్పినట్టు అవుతుంది. తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్లినా, విద్యార్థులు స్కూల్ కి వెళ్లి టిఫిన్ చేసి పాఠాలు చదువుకుంటారు. మధ్యాహ్నం కూడా బడిలోనే భోజనం చేసి, సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు.
తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం అమలుతీరు పరిశీలనకు ఇటీవలే తెలంగాణ అధికారుల బృందం వెళ్లి వచ్చింది. వారి నివేదిక పరిశీలించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకే ఈ పథకం అమలు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం ప్రైమరీ స్కూల్స్ తోపాటు, హైస్కూల్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టబోతోంది.