జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ
రేషన్ కార్డులు, రైతుభరోసాపై నిర్ణయం తీసుకునే చాన్స్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం జనవరి 4న సమావేశం కానుంది. సెక్రటేరియట్ లో 4న సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ, రైతుభరోసా విధివిధానాల ఖరారు, రాష్ట్రంలో భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక, దానిపై చేపట్టాల్సిన తదుపరి చర్యలు, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది. సంక్రాంతి నుంచే రైతుభరోసా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతుభరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎంతఖర్చవుతుంది.. కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల ఖరారుపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది.