ఫిబ్రవరి 3 లేదా 5న తెలంగాణ బడ్జెట్: రూ.3లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా

Telangana Budget 2023: 2023-24 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ రూ. 2.85 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఆర్థిక శాఖ రెండు వారాల క్రితం బడ్జెట్ సన్నాహాలను ప్రారంభించింది.

Advertisement
Update:2023-01-21 10:07 IST

Telangana Budget 2023: ఫిబ్రవరి 3 లేదా 5న తెలంగాణ బడ్జెట్: రూ.3లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి టి హరీష్ రావు 2023-24 రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 3 లేదా 5వ‌ తేదీల్లో సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌పై శనివారం ప్రగతి భవన్‌లో జరగనున్న అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, తెలంగాణకు కేంద్రం కేటాయించే బడ్జెట్ పై ఓ అంచనా వస్తుంది.

2023-24 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ రూ. 2.85 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఆర్థిక శాఖ రెండు వారాల క్రితం బడ్జెట్ సన్నాహాలను ప్రారంభించింది. జీతాలు, ఇతర ఖర్చులతో పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం అన్ని ప్రభుత్వ శాఖల నుండి అవసరమైన ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు అందాయి. 2023-24లో తెలంగాణకు కేంద్రం కేటాయింపులు స్పష్టమైన తర్వాత, మన‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పిస్తారు.

కేంద్ర ప్రభుత్వం విధించిన ఆర్థిక పరిమితులు, ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలకు నిధుల విడుదలలో జాప్యం ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర పన్ను ఆదాయం (SOTR) లో 19-20 శాతం వృద్ధిని నమోదు చేసింది.

నిపుణుల అంచనాల ప్రకారం, 2022-23లో కేంద్రం ఆంక్షల కారణంగా తెలంగాణ దాదాపు రూ. 15,000 కోట్ల రూపాయలు నష్టపోయింది.. ఏది ఏమైనప్పటికీ, తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి)10 శాతానికి పైగా వృద్ధి రేటును కొనసాగిస్తున్నట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌ను మార్చిలో సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఆర్థిక కసరత్తు పూర్తి చేసి ఫిబ్రవరిలోనే రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరినట్లు సమాచారం. “ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నందున, మన రాష్ట్రానికి కేటాయింపులపై పూర్తి స్పష్టత వస్తుంది. అందువల్ల రాష్ట్ర బడ్జెట్‌ను మరింత ఆలస్యం చేయడంలో అర్థం లేదని ముఖ్యమంత్రి భావించారు. ”అని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాలను పూర్తి చేసి ఫిబ్రవరి నెలాఖరులోగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభ ఘనవిజయం సాధించడంతో తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీన్ని ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ జాతీయ ఎజెండా పై చర్చను ప్రారంభించేందుకు కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారని ముఖ్యమంత్రికి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags:    
Advertisement

Similar News