తెలంగాణ బీజేపీ నాయకుల్లో గుబులు.. కొత్త యాప్‌తో పరేషాన్

బీజేపీ ఇప్పటికే ఒక యాప్‌ను సిద్ధం చేసింది. దీనిలో వచ్చే డేటాను బట్టే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇకపై అంచనా వేస్తామని, ఏ నాయకులు పని చేస్తున్నారో.. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ యాప్ ద్వారా తెలిసిపోతుందని అధిష్టానం చెబుతోంది.

Advertisement
Update:2023-02-04 08:07 IST

తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు పూర్తిగా రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి గల్లీ లీడర్ల వరకు అందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎన్నికలకు సమాయాత్త పరుస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులు అసలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పంపే సమాచారంతోనే ఏం జరుగుతుందో తెలుసుకున్న పార్టీ హై కమాండ్.. ఇకపై తగిన సాక్ష్యాలు కూడా చూపెట్టాలని చెబుతోంది. అధిష్టానం ఆదేశాలను పాటించామని మాటలతో చెబితే సరిపోదని.. దానికి ఫొటో ఆధారాలను కూడా చూపెట్టాలని అంటోంది.

బీజేపీ ఇప్పటికే ఒక యాప్‌ను సిద్ధం చేసింది. దీనిలో వచ్చే డేటాను బట్టే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇకపై అంచనా వేస్తామని, ఏ నాయకులు పని చేస్తున్నారో.. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ యాప్ ద్వారా తెలిసిపోతుందని అధిష్టానం చెబుతోంది. రాష్ట్రంలోని కొంత మంది నిర్దేశించిన బీజేపీ నాయకులను ఈ యాప్‌కు యాక్సెస్ ఇచ్చారు. ఇకపై తమ పరిధిలో జరిగే కార్యక్రమాలను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా వాటికి సంబంధించిన ఫొటోలు కూడా అప్‌లోడ్ చేయాలట. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ యాప్ ద్వారానే ఏ నాయకుడి పని తీరు ఎలా ఉందే విశ్లేషిస్తారని తెలుస్తున్నది. ఈ ఫొటోలే నాయకుడి పని తీరుకు గీటురాయిగా ఉంటాయని కూడా చెప్పారు. ఇటీవల ప్రధాని మోడీ మన్‌ కీ బాత్ కార్యక్రమం నిర్వహించగా.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఇకపై కార్నర్ మీటింగ్స్‌ను కూడా ఇలాగే అప్‌లోడ్ చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, నియోజకవర్గాల స్థాయిలో ఇందు కోసం సోషల్ మీడియా ఇంచార్జులను కూడా బీజేపీ నియమించింది. వీరికి త్వరలోనే ఒక వర్క్ షాప్ నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు.

యాప్ తీసుకొని రావడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కానీ, కేవలం యాప్‌లో ఫొటోలను విశ్లేషించి నాయకుడి పని తీరును ఎలా బేరీజు వేస్తారనే వాదన వినిపిస్తోంది. అలా అయితే కేవలం ఫొటోల రాజకీయం చేసే నాయకులు పుట్టుకొస్తారని, ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం ఫొటోలతో మేనేజ్ చేస్తారని కొందరు విమర్శిస్తున్నారు. నాయకులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు ఉండాలి కానీ, ఇలా ఫొటోలతో అంచనాలు వేయడం ఏంటని కొందరు అపుడే విమర్శలు చేస్తున్నారు.

ఒకప్పుడు మీడియాలో కనిపించే ఉద్దేశంతో చాలా మంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి.. దాని పేపర్ కటింగ్స్ పైకి పంపేవారని.. ఇప్పుడు అలాంటి నాయకులు మళ్లీ తయారవుతారని చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే ఈ పద్దతి ఏ మాత్రం సరి కాదని కూడా అంటున్నారు. అయితే వీరి మాటలను మాత్రం అధిష్టానం పట్టించుకోవడం లేదు. యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సిందేనని ఆదేశాలు రావడంతో బీజేపీ నాయకులు పరేషాన్ అవుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News