ఈ సారి రెండు రోజులే అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఛాంబర్‌లో బీఏసీ మీటింగ్‌లో మంత్రులు, చీఫ్ విప్, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరపున అక్బరుద్ధీన్ ఓవైసీ పాల్గొన్నారు. 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.

Advertisement
Update:2022-09-06 16:43 IST

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కేవలం రెండు రోజుల పాటే జరుగనున్నాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన బీఏసీ మీటింగ్‌లో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారుతో పాటు సమావేశాల్లో మాట్లాడే అంశాలు, పద్దులపై చర్చ జరిగింది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, చీఫ్ విప్, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరపున అక్బరుద్ధీన్ ఓవైసీ పాల్గొన్నారు. 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.

కాగా, కేవలం రెండు రోజులే సభలు నిర్వహించడంపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. మరిన్ని ఎక్కువ రోజులు నిర్వహిస్తే.. అనేక అంశాలు చర్చించే వీలుంటుందని కోరాయి. ప్రతీ సారి సభ నిర్వహించే రోజుల సంఖ్య తగ్గిపోతోందని ఆరోపించాయి. మరిన్ని రోజులు సభ నిర్వహించమని మజ్లిస్, కాంగ్రెస్ పార్టీ కోరాయి. కాగా, పని రోజులు తగ్గినా.. ఎక్కవ గంటలు పని చేస్తూ.. సభా వ్యవహారాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని మంత్రులు గుర్తు చేశారు. ఈ సారి వినాయక నిమజ్జనంతో పాటు తెలంగాణ జాతీయ సమైక్య ఉత్సవాలు ఉన్నందున ఎక్కువ రోజులు సభ నిర్వహించలేక పోతున్నట్లు మంత్రులు.. బీఏసీ సమావేశంలో చెప్పారు.

వర్షాకాల సమావేశాలను రెండు రోజులే నిర్వహించినా.. శీతాకాల సమావేశాలను మాత్రం 14 రోజుల పాటు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తామని మంత్రులు చెప్పారు. కాగా, హైదరాబాద్ సమస్యలు, మైనార్టీలపై చర్చించాలని ఎంఐఎం కోరగా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం తరపున మంత్రులు చెప్పారు. ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.

చనిపోయిన ప్రజాప్రతినిధులకు నివాళి

గతంలో వాయిదా పడిన శాసన సభ సమావేశాలకు కొనసాగింపుగా ఇవ్వాళ ఒక రోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్థన్ రెడ్డికి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ సభను ఈనెల 12కు వాయిదా వేశారు.

శాసన మండలి సమావేశంలో గోదావరి వరదలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కేంద్ర ప్రతినిధులు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించినా ఒక్క పైసా సాయం చేయాలేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ను అక్కడకు పంపి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారని ఆయన ఆరోపించారు. 35 ఏళ్ల తర్వాత భారీ వర్షాలు కురిశాయని, 135 శాతం వర్షపాతం నమోదైందని పల్లా చెప్పారు. వరదలు వచ్చిన సమయంలో కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. కానీ కేవలం విమర్శలకే పరిమితమైందని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News