తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఈవీఎం పరిశీలన ప్రారంభించిన ఈసీఐ
ఈవీఎంలకు సంబంధించిన సాంకేతిక అంశాలు, పరిపాలన భద్రతలు, కొత్త సింబల్స్ లోడింగ్ యూనిట్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనున్నాయి. దీనికి సంబంధించిన సన్నాహాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో శుక్రవారం 33 జిల్లాల ఎలక్టోరల్ ఆఫీసర్లు (డీఈవోలు), డిప్యుటీ డీఈవోలతో ఒక రోజు వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో ఈవీఎంల మొదటి దశ తనిఖీలపై డీఈవోలకు అవగాహన కల్పించారు.
ఈవీఎంలకు సంబంధించిన సాంకేతిక అంశాలు, పరిపాలన భద్రతలు, కొత్త సింబల్స్ లోడింగ్ యూనిట్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఈవీఎం మెషిన్లు, వీవీ పాట్లు ఎలా వినియోగించాలి, వాటి భద్రత ఎలా ఉంటుందనే విషయాలను కూడా ఎలక్టోరల్ ఆఫీసర్లకు వివరించారు. ఈ మెషిన్లను తయారు చేసిన ఈసీఐఎల్ నుంచి వచ్చిన 16 మంది ఇంజనీర్ల బృందం ఈవీఎం, వీవీ ప్యాట్ హ్యాండ్స్ ఎలా ఉపయోగించాలనే విషయంపై శిక్షణ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అందరూ సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, వ్యయం, సున్నిత నియోజకవర్గాల గుర్తింపు, ప్రమాదకరమైన పోలింగ్ స్టేషన్లు, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లను నిశితంగా పరిశీలించి, జాబితాను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న మానవ వనరుల డేటాబేస్ తయారు చేయడంతో పాటు.. ఎన్నికలకు సంబంధించి 18 మంది నోడల్ అధికారులను నియమించాలని ఆయన సూచించారు. పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్, ఇంటి నుంచి ఓటు వేసే వారిని గుర్తించి.. దానికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేయాలని కోరారు. షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ ఆగస్టు 2న ప్రకటించాలని.. తుది రోజు ఆగస్టు 4న ప్రకటించాలని ఆయన సూచించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న డీఈవోలు, డిప్యుటీ డీఈవోలు జిల్లాలకు వెళ్లిన తర్వాత ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతే కాకుండా జిల్లాలకు వచ్చే ఈవీఎంలను రెండు దశల్లో పరిశీలిస్తారు.
ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో త్రిపుర, అండమాన్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎలక్షన్ కమిషన్, ఈవీఎం నోడల్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.