ఆ పని చేస్తే ఈరోజే నామినేషన్ ఉపసంహరించుకుంటా..
ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక ఇదని అన్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కోసం బీజేపీ, ఎంఐఎం పనిచేస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరి రోజు. మరికొన్ని గంటల్లో ఉపసంహరణకు టైమ్ పూర్తవుతుండగా బీఆర్ఎస్ కు ఓ సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉచిత కరెంటు విషయంలో బీఆర్ఎస్ చెబుతున్నవన్నీ అసత్యాలేనన్నారు. తెలంగాణలో 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు రేవంత్ రెడ్డి. ఒకవేళ నిజంగానే 24గంటలు సరఫరా చేస్తున్నట్టు నిరూపిస్తే తాను ఈరోజే తన నామినేషన్ ఉపసంహరించుకుంటానన్నారు. గత 6 నెలలుగా రోజుకి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నట్టు బీఆర్ఎస్ నేతలు నిరూపించాలని సవాల్ విసిరారు.
పదేళ్లుగా రాష్టాన్ని పట్టిపీడిస్తున్న చీడపురుగులను తొలగించే సమయం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక ఇదని అన్నారు. బీఆర్ఎస్ కోసం బీజేపీ, ఎంఐఎం పనిచేస్తున్నాయని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఏం చేసిందో చెబుతామని, మరి 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు.
కరెంటు చుట్టూ ప్రచారం..
అటు బీఆర్ఎస్ కూడా కరెంటు విషయంలోనే కాంగ్రెస్ ని పదే పదే టార్గెట్ చేస్తోంది. రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు చాలంటున్నారని, కర్నాటకలో కాంగ్రెస్ కేవలం 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తోందని, అలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మూడు గంటలే కరెంటు సరఫరా చేస్తామని తానెక్కడా అనలేదని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగా తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని విమర్శిస్తున్నారు.