రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.71 లక్షల కోట్లు కాగా.. ఇప్పుడది రూ2.90 లక్షల కోట్లకు పెరిగింది. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు.

Advertisement
Update:2023-02-06 11:18 IST

2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.71 లక్షల కోట్లు కాగా.. ఇప్పుడది రూ2.90 లక్షల కోట్లకు పెరిగింది. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

ఈ ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బడ్జెట్‌ ప్రతులతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు. అనంతరం అక్కడినుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ ప్రతులను అందించారు. అనంతరం అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.


తెలంగాణ బడ్జెట్ లో ఈసారి కూడా వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారు. వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు కేటాయించగా, నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 26,885 కోట్లు, విద్యుత్ కు రూ. 12,727 కోట్లు కేటాయించారు.

ఇక సంక్షేమానికి కూడా భారీగానే కేటాయింపులు జరిగాయి. ఆస‌రా పెన్షన్లకోసం రూ. 12 వేల కోట్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 3,210 కోట్లు, ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు, మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు, గిరిజ‌న సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికోసం రూ. 15,223 కోట్లు కేటాయింపులు జరిగాయి.

విద్యా రంగానికి రూ. 19,093 కోట్లు, వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు, హరిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు వ్యయం చేయబోతున్నట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు. హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు, పరిశ్రమల శాఖ‌కు రూ. 4,037 కోట్లు, పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,372 కోట్లు, రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు కేటాయించారు.

బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా.. తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అడగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. కేంద్ర సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ సత్సంకల్పంతో.. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందు నిలుస్తోందని చెప్పారు హరీష్ రావు. తెలంగాణ ఆచ‌రిస్తుంది.. దేశం అనుస‌రిస్తోందన్నారు. ఆర్థిక మాంద్యం, క‌రోనా సంక్షోభాల‌ను త‌ట్టుకుని రాష్ట్రం నిల‌బ‌డిందని, తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిందని, సంక్షోభ స‌మ‌యాల్లో స‌మ‌ర్థంగా ఆర్థిక నిర్వహణతో అందరి మన్ననలు పొందామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News