మాస్టర్ ఆఫ్ ఎనర్జీ.. మాస్టర్ ఆఫ్ ఇన్నోవేషన్
కేటీఆర్ చదువు, అమెరికాలో ఆయన ఉద్యోగం గురించి తనకు తెలుసని, కానీ ఆయన ఫార్మాలిటీలు, హోదాలు పక్కనపెట్టి మాట్లాడతారని తాను అనుకోలేదని చెప్పారు గుర్నాని.
హైదరాబాద్ లో జరిగిన మహీంద్రా యూనివర్శిటీ కాన్వొకేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ని పొగడ్తల్లో ముంచెత్తారు టెక్ మహీంద్రా సంస్థ సీఈఓ, ఎండీ సీపీ గుర్నాని. కేటీఆర్ లాంటి నాయకుడిని తానింతవరకు చూడలేదని అన్నారాయన. 2014 నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. అప్పట్లో తాను సీఎం కేసీఆర్ ని కలిశానని, ఆ సందర్భంగా తమ మధ్య గొప్ప చర్చ జరిగిందని చెప్పారు. అయితే అంతకు ముందే కేటీఆర్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, మంత్రిగారు మీతో మాట్లాడతారని తనకు ఫోన్ కలిపారని, 'మంత్రిగారూ చెప్పండి' అని తాను అనగానే, అవతలి నుంచి 'కాల్ మీ రామ్' అని వినిపించిందని.. ఆ మాటతోనే తాను ఆశ్చర్యపోయానని అన్నారు. కేటీఆర్ చదువు, అమెరికాలో ఆయన ఉద్యోగం గురించి తనకు తెలుసని, కానీ ఆయన ఫార్మాలిటీలు, హోదాలు పక్కనపెట్టి మాట్లాడతారని తాను అనుకోలేదని చెప్పారు గుర్నాని.
నా జీవితంలో మొదటిసారి..
గతంలో తాను చాలామంది రాజకీయ నాయకులను, మంత్రులను కలిశానని, కానీ తొలిసారిగా తనను కలవడంకోసం ఒక మంత్రి తన ఆఫీస్ కి రావడం కేటీఆర్ తోనే మొదలైందని చెప్పారు. తాను వచ్చి కలుస్తానని చెప్పినా, కేటీఆర్ స్వయంగా తన ఆఫీస్ కి వచ్చి కలిశారని, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆయన ఆషామాషీగా రాలేదని, ఆ మీటింగ్ కోసం చాలా ప్రిపేర్ అయి వచ్చారని గుర్తు చేసుకున్నారు గుర్నాని. హైదరాబాద్ ని ప్రపంచ ఇన్నోవేటివ్ రాజధానిగా మార్చడంకోసం మనం ఏంచేయగలం అని కేటీఆర్ తనతో చర్చించారని అన్నారు గుర్నాని.
మాస్టర్ క్రియేటర్ ఆఫ్ న్యూ తెలంగాణ..
ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియాలో చమత్కారమైన సమాధానాలిస్తున్న మంత్రిగా, తెలంగాణ భావి నాయకుడిగా, అలుపెరగని సైనికుడిగా కేటీఆర్ అందరికీ తెలుసని, అయితే ఆయన మాస్టర్ ఆఫ్ ఎనర్జీ, మాస్టర్ ఆఫ్ ఇన్నోవేషన్, మాస్టర్ ఆఫ్ ఇన్స్ పిరేషన్, క్రియేటర్ ఆఫ్ న్యూ తెలంగాణ కూడా అని చెప్పారు సీపీ గుర్నాని.
అది కేటీఆర్ వల్లే సాధ్యం..
హైదరాబాద్ ఇన్నోవేష్ క్యాపిటల్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ గా, మెటావర్స్ క్యాపిటల్ గా మారడానికి, టీ హబ్ ఇంత అద్భుతంగా ఉండటానికి కారణం కేవలం కేటీఆర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు గుర్నాని. టీహబ్ కోసం ప్రభుత్వం 42 కోట్ల రూపాయలు కేటాయించగా.. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తాము తలా ఒక కోటి రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చామని.. ఇప్పుడది 350 కోట్ల రూపాయల ఇన్నోవేటివ్ క్యాంపస్ గా మారిందని చెప్పారు. వీటన్నిటికీ కారణం కేటీఆర్ చొరవేనని అన్నారు గుర్నాని.