మెట్రోలో టీడీపీ రచ్చ.. ప్రయాణికులు, సిబ్బందితో వాగ్వాదం
మెట్రో స్టేషన్లలో కూడా అక్కడక్కడ ఆందోళనకారులు సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. నల్ల దుస్తులు వేసుకున్నవారిని లోపలికి రానీయకుండా కొన్ని స్టేషన్లలో సిబ్బంది అడ్డుకున్నారు.
చంద్రబాబుకి మద్దతుగా వీకెండ్ ప్రొటెస్ట్ మొదలైంది. 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' అంటూ చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్ మెట్రో రైళ్లు ఎక్కారు. నల్ల చొక్కాలు, నల్ల ఫ్యాంట్లు ధరించి వారు తమ నిరసన తెలియజేశారు. ఓ దశలో ఈ నిరసన, సాధారణ ప్రయాణికులకు చికాకు కలిగించింది. మెట్రో రైళ్లలో ఎక్కి నినాదాలేంటని చాలామంది వారిని వారించారు. ప్రయాణికులకు, టీడీపీ సానుభూతిపరులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎల్బీనగర్, మియాపూర్ స్టేషన్లు మూత..
ఈ ఉదయం పెద్ద ఎత్తున చంద్రబాబు అభిమానులు మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ రద్దీతో యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల రావడంతో చంద్రబాబు అభిమానులు మరింత గట్టిగా నినాదాలిచ్చారు. స్టేషన్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని అడ్డుకోడానికి కొంతసేపు ఎల్బీనగర్, మియాపూర్ స్టేషన్లను మూసివేసి ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మెట్రో స్టేషన్ కి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు.
స్టేషన్లలో కూడా గొడవే..
మెట్రో స్టేషన్లలో కూడా అక్కడక్కడ ఆందోళనకారులు సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. నల్ల దుస్తులు వేసుకున్నవారిని లోపలికి రానీయకుండా కొన్ని స్టేషన్లలో సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో నల్ల డ్రెస్ లు వేసుకున్నవారు గుంపుగా లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే తమని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
♦