బీజేపీ వైపు.. దివ్యవాణి చూపు ?
తాజాగా ఆమె బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ని సినీ నటి దివ్యవాణి కలవడం.. మారిన పరిస్థితుల్లో ఆమె బీజేపీ గూటికి చేరేందుకేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత, సినీ నటి దివ్యవాణి బీజేపీ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ని హైదరాబాద్ శామీర్‌పేటలోని ఆయన నివాసంలో ఆమె గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరే యోచనతోనే ఈటల రాజేందర్‌ని కలిశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన దివ్యవాణి ఈ ఏడాది ఆ పార్టీ నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా టీడీపీలో యాక్టివ్ గా ఉన్న దివ్యవాణి.. పార్టీ తరపున తన వాయిస్ ను బలంగా వినిపించేవారు. మహానాడుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమాల్లో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే మహానాడులో జరిగిన కొన్ని ఘటనలతో మనస్తాపం చెందిన ఆమె పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు రాజీనామా ప్రకటన సందర్భంగా వెల్లడించారు.
కొన్ని దుష్టశక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నానని అప్పట్లో ప్రకటించిన దివ్యవాణి.. చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ``నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటారేమో. ఒక ఆర్టిస్టుగా పార్టీ కోసం వస్తే అన్ని రకాలుగా అణిచివేశారు. ఒక కళాకారుడు(స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ..) పెట్టిన పార్టీలో కళాకారులకు చోటు లేదు. మురళీమోహన్‌కు వ్యాపారాలు వేరే ఉన్నాయి కాబట్టి కొనసాగుతున్నారు. అధికారం లేని అధికార ప్రతినిధిగా నన్ను మిగిల్చారు.`` అంటూ విమర్శించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మూడేళ్ల క్రితమే ఆమె కమలం గూటికి చేరబోతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె అప్పట్లోనే కొట్టిపారేశారు. తన తుదిశ్వాస విడిచే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని దివ్యవాణి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె బీజేపీ జాయినింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ని కలవడం.. మారిన పరిస్థితుల్లో ఆమె బీజేపీ గూటికి చేరేందుకేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.