పిల్లనగ్రోవి, పింఛం తీసేసినా కుదరదు..

విగ్రహం ఏర్పాటుపై స్టే ని కొనసాగిస్తూ విచారణను జూన్6కి వాయిదా వేశారు. దీంతో ఎన్టీఆర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ దాదాపు అసాధ్యమని తేలిపోయింది.

Advertisement
Update:2023-05-25 21:52 IST

ఖమ్మంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో సస్పెన్స్ ఇంకా తొలగిపోలేదు. విగ్రహం ఏర్పాటుపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ గొడవ మొదలైంది. విగ్రహం రూపు రేఖల్ని మార్చేందుకు కమిటీ అంగీకరించింది. చేతిలో పిల్లనగ్రోవి, కిరీటంపై నెమలి పింఛం తీసేస్తున్నామని కమిటీ తరపున అడ్వొకేట్ జనరల్ రాంచందర్ రావు హైకోర్టుకి తెలిపారు. అయినా కూడా కోర్టు అనుమతివ్వలేదు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, నిర్వాహకులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది.

ఖమ్మంలోని లకారం చెరువులో 54 అడుగుల ఎత్తున శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4కోట్ల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాన్ని తయారు చేయించి లకారం చెరువు మధ్యలో ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈనెల 28న ఎన్టీఆర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ చేయాలనుకున్నారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు కూడా. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే అంతలోనే విగ్రహావిష్కరణపై ఆరోపణలు వచ్చాయి.

కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో 14 రిట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ జేఏసీ, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈనెల 18న స్టే విధించింది. ఆ తర్వాత నిర్వాహకులు విగ్రహం రూపు రేఖల్ని మార్చాలనుకున్నారు. పిల్లనగ్రోవి, పింఛం తీసేశామని అది కేవలం ఎన్టీఆర్ విగ్రహమేనని, శ్రీకృష్ణుడి రూపం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పిటిషనర్లు ససేమిరా అంటున్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పబ్లిక్ ప్లేసులో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటే ఆయన పోషించిన వేరే పాత్రల రూపంలో పెట్టుకోవచ్చన్నారు. అలా కాకుండా దేవుని రూపంలో విగ్రహం పెట్టడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు.

శ్రీకృష్ణుడికి కులం ఏంటి..?

శ్రీ కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ సినిమాల్లో నటించినపుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు జస్టిస్ రాంచందర్ రావు. శ్రీ కృష్ణుడు ఒక కులానికి దేవుడు కాదని, దేవుడికి కులాన్ని ఆపాదించటం సమంజసం కాదన్నారు. అయితే విగ్రహం ఏర్పాటుపై స్టే ని కొనసాగిస్తూ విచారణను జూన్6కి వాయిదా వేశారు. దీంతో ఎన్టీఆర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ దాదాపు అసాధ్యమని తేలిపోయింది. 

Tags:    
Advertisement

Similar News