తెలంగాణలో రెండో అనుమానితుడు.. ఖమ్మంలో కలవరం..
మంకీపాక్స్ అనుమానంతో అతని శాంపుల్స్ సేకరించారు. ప్రస్తుతానికి ఈ రెండూ అనుమానాలే అయినా ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి.
తెలంగాణలో మంకీపాక్స్ కలవరం కొనసాగుతోంది. కామారెడ్డి ఇందిరా నగర్ కి చెందిన వ్యక్తికి మంకీపాక్స్ ఇంకా నిర్ధారణ కాలేదు, అనుమానితుడిగానే అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈలోగా ఖమ్మంలో ఇలాంటి కేసే మరొకటి కనిపించింది. ఖమ్మంలోని ఓ గ్రానైట్ కంపెనీలో పని చేసేందుకు ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన 35 ఏళ్ల కార్మికుడికి శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు అతడిని పరీక్షించి అనుమానంతో జిల్లా వైద్య శాఖ అధికారికి సమాచారం ఇచ్చారు. మొదట జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించి అనంతరం హైదరాబాద్ తరలించారు. మంకీపాక్స్ అనుమానంతో అతని శాంపుల్స్ సేకరించారు. ప్రస్తుతానికి ఈ రెండూ అనుమానాలే అయినా ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి.
జ్వరం వస్తే ఓకే, జ్వరంతోపాటు ఒంటిపై దద్దుర్లు కనిపించినా, కాస్త ఒళ్లు దురదగా అనిపించినా సామాన్యులు కూడా హడలిపోతున్నారు. మంకీపాక్స్ లక్షణాలు అవే కాబట్టి హడావిడి పడుతున్నారు. కరోనా కాలంలో దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూసేవారు, ఇప్పుడు ఒంటిపై కాస్త జిల పుట్టి చేతికి పనిచెప్పినా అనుమానించాల్సిన పరిస్థితి. డాక్టర్లు కూడా ఎక్కడా రిస్క్ తీసుకోవడంలేదు, దద్దుర్లు వచ్చిన పేషెంట్ల వివరాలు వెంటనే ప్రభుత్వ అధికారులకు పంపించేస్తున్నారు. తాజాగా ఖమ్మంలో కూడా ఇదే జరిగింది. మంకీ పాక్స్ గా అనుమానిస్తూ ఉత్తర ప్రదేశ్ వ్యక్తిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే రెండు నెలల నుంచే తన ఒంటిపై దద్దర్లు ఉన్నాయని ఆ వ్యక్తి చెప్పాడని అధికారులంటున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని, పరీక్షల ఫలితాలు వచ్చాక మంకీపాక్సా..? కాదా..? అనేది తేలిపోతుందని చెబుతున్నారు అధికారులు.
మూడే కేసులు.. అనుమానాలే ఎక్కువ..
ప్రస్తుతం భారత్ లో అధికారికంగా మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. కేరళలో రెండు, ఢిల్లీలో ఒకటి. తెలంగాణ విషయంలో ఇప్పటికే రెండు అనుమానాలున్నాయి. వీటిని వైద్యులు నిర్ధారించాల్సి ఉంది. ఈ దశలో ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు మంకీపాక్స్ పై అవగాహన పెంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ఎవరూ భయపడొద్దని ఇప్పటికే ప్రకటించారు. అనుమానం ఉంటే కచ్చితంగా వైద్య అధికారులను సంప్రదించాలని కోరారు.