నల్లమలలో మళ్లీ అలజడి.. యురేనియం కోసం సర్వే!
నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టేందుకు 2002 నుంచే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ -UCIL, భారత అణు పరిశోధన సంస్థ - IMD ఆధ్వర్యంలో సర్వేలు చేసి నమూనాలు సేకరించారు.
నల్లమల అడవుల్లో మళ్లీ యురేనియం చిచ్చు రాజుకుంటోంది. పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో అలజడి మొదలైంది. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో యురేనియం తవ్వకాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పెద్దగట్టు, నంభాపురం సమీపంలో కృష్ణానది వెంట నల్లమల గుట్టలపై రెండ్రోజుల కిందట హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో మళ్లీ యురేనియం అన్వేషణ మొదలైందని ప్రచారం సాగుతోంది.
నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టేందుకు 2002 నుంచే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ -UCIL, భారత అణు పరిశోధన సంస్థ - IMD ఆధ్వర్యంలో సర్వేలు చేసి నమూనాలు సేకరించారు. చిత్రియాల, పెద్దమూలలో వెయ్యి హెక్టార్లు, పీఏపల్లి మండలంలోని పెద్దగట్టు, నంభాపురంలో 1301 ఎకరాలు, ముదిగొండలో 200 ఎకరాల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు.
అయితే యురేనియం తవ్వకాలను మొదటి నుంచి స్థానికులు, ప్రజాసంఘాలు, శాస్త్రవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. అటవీ సంపద నాశనమవడంతో నాగార్జున సాగర్ జలాలు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో UCIL సదరు ప్రతిపాదనలు విరమించుకుంది. ఇక్కడ తవ్వకాలు చేపట్టొద్దని అప్పటి రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. తాజాగా UCIL ఇక్కడ హెలికాప్టర్‌తో మరోసారి సర్వే చేపడుతోందని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. కేంద్రప్రభుత్వానికి చెందిన ఓ వాహనం కూడా పలుమార్లు చక్కర్లు కొట్టడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ విషయంపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.