వృద్ధురాలిని చంపి తినేసిన వీధి కుక్కలు.. సిరిసిల్ల జిల్లాలో ఘోరం

ఆమె తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉండటంతో పాటు ముఖం గుర్తుపట్టలేని విధంగా కొరికేసి ఉండటాన్ని గుర్తించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏదైనా జంతువు దాడి చేసి ఉంటుందనే అనుమానంతో గ్రామస్తులతో కలిసి చుట్టుపక్కల వెతికారు.

Advertisement
Update:2024-08-02 09:54 IST

ఇటీవల కాలంలో వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు పెచ్చుమీరుతున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఘటన ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ఉంది. ఏకంగా ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలి పైకి వీధి కుక్కలు దాడి చేసి ఆమె మరణానికి కారణమయ్యాయి. ఆ తర్వాత ఆమె శరీర భాగాలు కూడా తినేయడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం వేకువజామున ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్‌ మండలం సేవాలాల్ తండా పరిధిలో గల బట్టువానితాళ్ల గ్రామానికి చెందిన పిట్ల రాజ్యలక్ష్మి, పోచయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారికి పెళ్లిళ్లు అయిన తర్వాత కుమారులు వరుసగా పెంకుటిళ్లు నిర్మించుకుని వాటిలో ఉంటున్నారు.

రాజ్యలక్ష్మి (82) భర్త పోచయ్య 11 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ప్రస్తుతం రాజ్యలక్ష్మి ఒక్కరే కుమారుల ఇంటికి ఆనుకునే ఉన్న రేకుల ఇంట్లో ఉంటున్నారు. కుటుంబసభ్యులు నిత్యం ఆమెకు భోజనం తెచ్చి ఇచ్చి బాగోగులు చూస్తుంటారు. బుధవారం రాత్రి కూడా ఆమెకు భోజనం పెట్టి వెళ్లారు. తెల్లవారుజామున పొలం పనులకు వెళ్లే క్రమంలో తల్లి ఉంటున్న గది తలుపు తెరిచి ఉండటాన్ని గమనించిన కుమారులు అనుమానంతో లోపలికి వెళ్లి చూశారు. ఆమె తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉండటంతో పాటు ముఖం గుర్తుపట్టలేని విధంగా కొరికేసి ఉండటాన్ని గుర్తించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏదైనా జంతువు దాడి చేసి ఉంటుందనే అనుమానంతో గ్రామస్తులతో కలిసి చుట్టుపక్కల వెతికారు. ఓ కుక్క మాంసం ముద్దలను నోట కరచుకుని ఉండటాన్ని గుర్తించి హతాశులయ్యారు. వెంటనే దాన్ని హతమార్చారు. గ్రామంలోని మరికొన్ని కుక్కల మూతులకు రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించి.. ఇది వీధి కుక్కల పనేనని అర్థం చేసుకున్నారు. దాదాపు పది కుక్కల వరకు సమూహంగా దాడి చేసి ఉంటాయనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యలక్ష్మికి రాత్రివేళ బహిర్భూమికి వెళ్లే అలవాటు ఉందని, తలుపు గడియ పెట్టుకోదని, తలుపు మూసి.. వెనుక బండరాయి పెట్టి మంచంపై నిద్రపోతుందని ఆమె కుమారులు తెలిపారు. కుక్కలు తలుపు నెట్టి లోపలికి చొరబడి ఆమెపై దాడి చేసి ఉంటాయని, ముఖం, కాళ్లు, చేతులను కొరికి తిని చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పొలం పనులు చేసి ఆదమరిచి నిద్రిస్తున్నందున ఆమె ఆర్తనాదాలు వినిపించలేదని కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు గ్రామంలో 50 వరకు ఉన్నాయని, వాటినుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News