కాంగ్రెస్ లో 'తెలంగాణ తల్లి' చిచ్చు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ ఆ పార్టీలో వర్గ విభేదాలు తగ్గడం లేదు. సెప్టంబర్ 17న గాంధీ భవన్ లో ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేతల మధ్య‌ విభేదాలు భగ్గుమన్నాయి.

Advertisement
Update:2022-09-16 13:48 IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, పార్టీలో ఉన్న సీనియర నాయకులకు మధ్య ఎప్పుడూ ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంటుంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడవడమే ఇష్టంలేని ఆ పార్తీలోని సీనియర్లు ఆయనకు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. రేవంత్ కూడా సీనియర్లకు ఎన్నడూ గౌరవమిచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ, సీనియర్ నేతలు అని రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ప్రియాంకా గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూర్చో బెట్టి మాట్లాడినప్పటికీ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉన్నది.

ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా చేయడంతో రాబోతున్న మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ లో మరింత గొడవలకు కారణమయ్యింది. రాజగోపాల రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి రేవంత్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొంది. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వెంకట రెడ్డి సహకరిస్తారనే నమ్మకం ఆ పార్టీలోనే ఎవ్వరికీ లేదు. మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే తన భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉంటుందని భావిస్తున్న రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా అనేక ప్రణాళికలు రచిస్తున్నాడు. కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయనకు అడ్డు తగులుతూనే ఉన్నారు.

సెప్టంబర్ 17 వ తేదీని తనకు ఒక కలిసొచ్చిన అవకాశంగా భావించిన రేవంత్ ఆ రోజు తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏర్ప్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడి ప్రజలకు, పోరాటాలకు అద్దంపట్టే విధంగా లేదని, కాంగ్రెస్ పార్టీ మరో విగ్రహాన్ని తయారు చేయించి 17న ఆవిష్క‌రణ చేస్తుందని ప్రకటించారు రేవంత్. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర జెండా కూడా కొత్తది ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అధికారంలోకి వచ్చాక '''జయ జయ హే తెలంగాణ...'' అనే అందెశ్రీ రాసిన గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని, తెలంగాణ కోడ్ ను టీఎస్ గా కాక టీజీగా మారుస్తామని రేవంత్ తెలిపారు. పీసీసీ విస్త్రుత స్థాయి సమావేశంలో ఈ అన్ని అంశాలను తీర్మానాలుగా ఆమోదించారు. ఇక విగ్రహ ఏర్పాటుకు రేవంత్ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు రేవంత్ నిర్ణయాలను అడ్డుకున్నారు.

జానారెడ్డి ఇంట్లో సమావేశమైన‌ సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్ర జెండాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం భరత మాత విగ్రహం లాగా ఉండాలని, అలాగే జెండా ఉండాలో వద్దో అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జానారెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదని జాతీయ స్థాయిలో ఆలోచించాలని జానారెడ్డి అన్నట్టు తెలుస్తోంది. అంతే కాక ఈ 17 వ తేదీన గాంధీ భవన్ లో విగ్రహ ఆవిష్క‌రణ ఆపేయాలని సీనియర్లందరూ కుండ బ‌ద్దలు కొట్టినట్టు సమాచారం.

జానారెడ్డి తో సహా కాంగ్రెస్ లోని సీనియర్లంతా తన నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ఏం చేయాలోపాలుపోని రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News