అందరికీ రుణమాఫీ చేయాల్సిందే.. ఈనెల 22న బీఆర్ఎస్ ధర్నాలు

రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-08-20 16:54 IST

రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంపై ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించింది బీఆర్ఎస్. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను గందరగోళానికి గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్.


అనేక ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అందరికీ రుణమాఫీ చేసేంతవరకు ప్రభుత్వం పోరాటం ఆగదన్నారు. ఎన్నికలకు ముందు రెండు లక్షల వరకు రుణమాఫీ అందరికీ వర్తింప చేస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు పూర్తవగానే రైతు రుణమాఫీ కోసం రూ. 40 వేల కోట్లు అవసరమని సీఎం స్వయంగా చెప్పారని, కానీ కేబినెట్ మాత్రం రూ. 31 వేల కోట్లకు మాత్రమే అనుమతిచ్చిందన్నారు. బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే పెట్టి రైతులను మోసం చేసే కార్యక్రమం చేశారని ఆరోపించారు కేటీఆర్. బడ్జెట్‌లో కేటాయించిన రూ.26 వేల కోట్లలో నుంచి కూడా కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా ముంచిందన్నారు.

Tags:    
Advertisement

Similar News