రేవంత్‌ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోయింది

మద్యం అమ్మకాలు తప్ప అన్నింటా తిరోగమనమే.. మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

Advertisement
Update:2024-10-21 14:18 IST

సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. అమ్మకాల్లో తప్ప అన్నింటా తిరోగమనమేనని తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఎస్‌బీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలకు, సెక్రటేరియట్‌ లో ఆర్థిక శాఖపై రివ్యూలో మాట్లాడిన మాటలకు అసలు పొంతన లేదన్నారు. రాష్ట్ర ఆదాయం ఎందుకు పడిపోయిందో సీఎం లోతుగా సమీక్షించడం లేదన్నారు. తన పది నెలల పాలనలో ఏ వర్గానికి విశ్వాసం కల్పించలేకపోయారు కాబట్టే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కూల్చివేతలతో రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతిన్నదని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. ఎకానమీ పరుగులు పెట్టాలంటే మార్కెట్‌లోకి డబ్బులు పంప్‌ చేయాలని.. కేసీఆర్‌ పాలనలో అదే చేశారని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు వేశారని తెలిపారు. కేసీఆర్‌ అనుసరించిన విధానాలతో కేసీఆర్‌ హయాంలో రాష్ట్ర ఆర్థిక రంగం కోలుకుంటే.. రేవంత్‌ పాలనలో పూర్తిగా పడిపోయిందన్నారు. హైదరాబాద్‌ ఎకానమీ 600 బిలియన్‌ డాలర్లకు చేరుస్తానని రేవంత్‌ చెప్తున్నారని, ముంబయి మహానగర ఎకానమీనే 300 బిలియన్‌ డాలర్లు అని తెలిపారు. కేసీఆర్‌ అనుసరించిన విధానాలతోనే హైదరాబాద్‌ 200 బిలియన్‌ డాలర్ల ఎకానమీకి చేరుకుందని.. అంటే రూ.16 లక్షల కోట్ల ఆదాయం అని తెలిపారు. కేసీఆర్‌ విజన్‌ తోనే అది సాధ్యమైందన్నారు.

కేసీఆర్‌ పాలనలో చేసిన అప్పులపైనా సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన కేబినెట్‌లోని మంత్రులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. దక్షణాది రాష్ట్రాల్లో అప్పులపై వడ్డీ తక్కువ చెల్లుస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణానే అన్నారు. ఇప్పటికైనా తెలంగాణాను బద్‌నాం చేయొద్దని, రాష్ట్రాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ అప్పులు చేసినా రాష్ట్రంలో ఆస్తులు సృష్టించారని అన్నారు. రూ.లక్ష కోట్లలోపు ఖర్చుతో కాళేశ్వరం నిర్మించి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చారని అన్నారు. రేవంత్‌ 30 కి.మీ.ల మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నాడని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి రేవంత్‌ పది నెలల్లో ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కేసీఆర్‌ కు తెలంగాణపై ప్రేమ ఉంది కాబట్టే ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసే చర్యలు తీసుకున్నారని తెలిపారు. జీవో 29పై సుప్రీం కోర్టు బంతిని హైకోర్టుకు చేర్చిందని అన్నారు. రిజర్వేషన్‌లపై రాజ్యాంగ స్ఫూర్తిని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఓపెన్‌ కేటగిరిలో గ్రూప్‌ -1 మెయిన్స్‌ కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:65 నిష్పత్తిలో అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయాలను పక్కన పెట్టి కొందిరికే లాభం చేసిందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు పల్లె రవికుమార్‌ గౌడ్‌, రాజారాం యాదవ్‌, కళ్యాణ్‌, కీర్తిలత తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News