కేసీఆర్ కేబినెట్ విస్తరణ..?

సీఎం కేసీఆర్ వ్యూహాలు తెలిసినవారు మాత్రం కేబినెట్ విస్తరణ ఉంటుందని, ఇద్దరికి చోటు ఖాయమని తేల్చి చెబుతున్నారు.

Advertisement
Update:2023-08-21 19:58 IST

రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆల్రడీ అభ్యర్థుల్ని కూడా ప్రకటించేశారు. ఈ దశలో తెలంగాణ కేబినెట్ విస్తరిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అయితే సీఎం కేసీఆర్ వ్యూహాలు తెలిసినవారు మాత్రం కేబినెట్ విస్తరణ ఉంటుందని, ఇద్దరికి చోటు ఖాయమని తేల్చి చెబుతున్నారు.

కేబినెట్ లోకి ఎవరెవరు..?

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఒక సీటు ఖాళీగా ఉంది. ఈటల రాజేందర్ పై వేటు వేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖను మంత్రి హరీష్ రావుకి అదనంగా కేటాయించారు. ఇప్పుడీ శాఖను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఇస్తారని అంటున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసేసుకున్నారని, రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా వార్తలొస్తున్నాయి.

రెండోసీటు ఎవరికి..?

సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన రాకతో కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ టికెట్ కోల్పోయారు. దీంతో ఆయన్ను మిగిలిన కాలానికి మంత్రిగా చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు కేటాయించే శాఖపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో 18మంది మంత్రులున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని తీసుకుంటే ఆ సంఖ్య 19కి చేరుతుంది. గంప గోవర్దన్ కి ఛాన్స్ ఇవ్వాలంటే మాత్రం ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి కేబినెట్ విస్తరణపై కేసీఆర్ ఆలోచన ఎలా ఉందో చూడాలి. మంత్రి వర్గ విస్తరణ ఖాయమైతే.. ప్రమాణ స్వీకారం చేయించాల్సిన గవర్నర్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేరు. ఆమె పుదుచ్చేరి నుంచి బయలుదేరి రావాలి. అప్పుడే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News