బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్
హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు రేపటిలోగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని సీఎం స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌ల కల్పన కోసం రాజకీయంగా వెనుకబడిన వర్గాల (బీసీ) జనాభా గణాంకాల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తిని తక్షణం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అందిన వారంలోగా నిర్ణయం ఉండాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం లోపు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు కానున్నది.
రేవంత్ రెడ్డి కమిషన్ ఏర్పాటు చేయకుండా సెన్సస్ పేరుతో మోసం చేసి, బీసీల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనిబీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఇటీవల విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు. రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించే రీతిలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీల నోట్లో మట్టి కొట్టాలనే కుట్రపూరిత ప్రయత్నం చేస్తున్నారు.కులగణనపై హైకోర్టు ఆదేశాలు అందలేదని బీసీ కమిషన్ చైర్మన్ చెప్పడం దుర్మార్గమన్నారు. రేవంత్ చెప్పుచేతల్లో బీసీ కమిషన్ పని చేస్తున్నదని ఆరోపించారు.సుప్రీంకోర్టు కూడా కులగణన మీద డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పిందని ఈ సందర్భంగా దాసోజు తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు రేపటిలోగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడం గమనార్హం.