నల్గొండకు సొనాటా సాఫ్ట్‌వేర్.. 200 మందికి ఉద్యోగావకాశాలు
బోస్టన్‌లోని వారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో నల్గొండ ఐటీ టవర్‌లో సొనాటా కార్యకలాపాలు ప్రారంభించడానికి ఒప్పందం కుదిరింది.
ఐటీ, ఐటీఈఎస్ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని టైర్-2, టైర్-4 పట్టణాలకు కూడా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే ఐటీ మినిస్టర్ కేటీఆర్ చొరవ వల్ల పలు జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లను నిర్మించి.. పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తాజాగా సొనాటా సాఫ్ట్‌వేర్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీని వీరవల్లితో భేటీ అయ్యారు. బోస్టన్‌లోని వారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణలో సొనాటా కార్యకలాపాలు ప్రారంభించడానికి ఒప్పందం కుదిరింది.
మోడ్రనైజేషన్ ఇంజనీరింగ్‌లో లీడింగ్ కంపెనీ అయిన సొనాటా సాఫ్ట్‌వేర్ తెలంగాణలోని నల్గొండ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నది. నల్గొండ ఐటీ టవర్‌లో తమ కార్యాలయం ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దీని వల్ల 200 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్‌పై ఈ కంపెనీ దృష్టి పెట్టింది.
ఆయా టెక్నాలజీలపై కంపెనీ ఇతర సంస్థలతో భాగస్వామ్యమై ఇంజనీర్లు మరిన్ని ఇన్నోవేటీవ్ సొల్యూషన్స్ అందించనున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లోని పరిశ్రమలకు సొనాటా సాఫ్ట్‌వేర్ సేవలు అందించనున్నది. ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత యువతకు నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నారు. తమ స్కిల్స్, టెక్నాలజీలను మరింతగా పెంచుకోవాలని భావిస్తున్న యువతకు ఇది మంచి అవకాశమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలోని నల్గొండకు సొనాటా టెక్నాలజీస్ రావడం ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది అని కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో ఐటీ, ఇండస్ట్రీస్ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్ఆర్ఐ అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి ఈ. విష్ణువర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.