ఆస్తి కోసం తల్లిని నరికి చంపిన కిరాతకుడు..తలతో పోలీస్ స్టేషన్ కు..

ఆస్ప‌త్రిలో కోలుకున్న తర్వాత కన్నప్ప గురువారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లి తీరు కారణంగానే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహంతో కత్తి తీసుకొని తల్లి మెడను నరికాడు.

Advertisement
Update:2023-02-10 10:57 IST

ఆస్తి కోసం కన్నతల్లిని కొడుకే నరికి చంపేశాడు. అంతటితో ఆవేశం చల్లారని ఆ దుర్మార్గుడు తల్లి తలను మొండెం నుంచి వేరు చేసి ఆ త‌ల‌ను చేతిలో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండెరాల ఆస్తికోసం కన్న కొడుకు ఇంత ఘాతుకానికి ఒడిగట్టడం తీవ్ర కలకలం రేపింది.

జనగామ జిల్లా మరిగడికి చెందిన కూరాకుల రమణమ్మ(65)కు కొడుకు కన్నప్ప, కూతురు లావణ్య ఉన్నారు. రమణమ్మ భర్త రాజయ్య పదేళ్ల క్రితమే చనిపోయాడు. కాగా, ర‌మ‌ణ‌మ్మ కొడుకు కన్నప్ప, కూతురు లావణ్యలకు పెళ్లిళ్లు జరిగాయి. భర్తతో విభేదాల కారణంగా లావణ్య తల్లి దగ్గరే ఉంటోంది. కన్నప్పకు భార్యతో పాటు ఒక కుమార్తె ఉంది.

ఇదిలా ఉండగా రమణమ్మ పేరిట పదెకరాల భూమి ఉంది. ఇటీవల ఆమె తన కుమార్తె లావణ్య పేరుమీద నాలుగు ఎకరాల భూమి రాసిచ్చింది. కన్నప్పకు మాత్రం రెండు ఎకరాలు మాత్రమే రాసిచ్చింది. దీనిపై కన్నప్ప కొద్ది రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడు. కూతురికి నాలుగు ఎకరాలు రాసిచ్చి, కొడుకుకు మాత్రం రెండు ఎకరాలు రాసి ఇవ్వడం ఏంటని, తనకు కూడా మరో రెండు ఎకరాలు రాసివ్వాలని కన్నప్ప పట్టుబట్టాడు.

అయితే తల్లి పట్టించుకోకపోవడంతో ఇటీవల కన్నప్ప ఆమెపై దాడికి పాల్ప‌డ్డాడు. గాయపడ్డ ఆమె కొడుకు మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తల్లి తనపై కేసు పెట్టడంతో కన్నప్ప తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చనిపోవాలని నిర్ణయించుకొని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. అయితే సమయానికి గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆస్ప‌త్రిలో కోలుకున్న తర్వాత కన్నప్ప గురువారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లి తీరు కారణంగానే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహంతో కత్తి తీసుకొని తల్లి మెడను నరికాడు. ఆ తర్వాత శరీరం నుంచి తలను వేరు చేసి చేత్తో పట్టుకుని కొంతసేపు గ్రామంలో సంచరించాడు. ఇది చూసిన జనం భయంతో వణికిపోయారు. ఆ తర్వాత కన్నప్ప తల్లి తలతో జనగామ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఆస్తి కోసం కన్నతల్లిని కొడుకు దారుణంగా హతమార్చడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Tags:    
Advertisement

Similar News