పిల్లల అనారోగ్యాన్ని చూడలేక.. బతుకు చాలించారు - సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబంలో విషాదం
శనివారం ఉదయం సతీశ్.. భార్యకు, పిల్లలకు సైనైడ్ ఇచ్చాడు. వారి చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ తీసుకున్నాడు. మధ్యాహ్నం తర్వాత తెలిసినవారు ఫోన్లు చేయడం, ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఇంటికొచ్చి చూడగా.. ఈ విషాద ఘటన వెలుగుచూసింది.
వారికి పిల్లలే ప్రాణం.. తమ బిడ్డల బంగారు భవిష్యత్తే తమ జీవిత లక్ష్యం అనుకున్నారు.. వారి ఎదుగుదల చూసి మురిసిపోవాలనుకున్నారు.. కానీ పుట్టిన ఇద్దరు పిల్లలూ అనారోగ్యంతో బాధపడుతుండటం చూసి తట్టుకోలేకపోయారు. ఏంచేసినా వారి ఆరోగ్యం మెరుగుపడదని భావించి.. బతుకే చాలించాలనుకున్నారు. పిల్లలతో కలిసి దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ కుషాయిగూడలోని కందిగూడలో శనివారం ఈ ఘటన జరిగింది.
నిజామాబాద్‌కు చెందిన గాదె సతీశ్(39) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందిన వేద (35) తో 2012లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ దంపతులకు వారు ఎదిగేకొద్దీ.. వారి అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి. వారి పెద్ద కుమారుడు నిషికేత్ (9) పుట్టిన నాటి నుంచే ఆటిజంతో బాధపడుతున్నాడు. రెండో కుమారుడు నిహాల్ (5) కూడా కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులకు చూపించగా.. మెనింజైటిస్ ఉన్నట్టు చెప్పారు.
పిల్లలిద్దరూ ఊహించని అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటాన్ని ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుండటం చూసి తల్లడిల్లిపోయారు. బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించడంతో జీవితంపై వారికి విరక్తి కలిగింది.
శనివారం ఉదయం సతీశ్.. భార్యకు, పిల్లలకు సైనైడ్ ఇచ్చాడు. వారి చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ తీసుకున్నాడు. మధ్యాహ్నం తర్వాత తెలిసినవారు ఫోన్లు చేయడం, ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఇంటికొచ్చి చూడగా.. ఈ విషాద ఘటన వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించగా, దంపతులు రాసి ఉంచిన లేఖ బయటపడింది. అందులో.. తమ నలుగురినీ కాపాడాలని ప్రయత్నించొద్దని.. తమను ప్రశాంతంగా చనిపోనివ్వాలని.. రాశారు. ఇద్దరూ పిల్లల అనారోగ్యంపైనే నిత్యం బాధపడుతుండేవారని వేద తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. వారికి సైనైడ్ ఎలా దొరికిందనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.