ఫూలే దంపతుల స్ఫూర్తితోనే తెలంగాణలో సామాజిక ప్రగతి

ఆ స్ఫూర్తిని కొనసాగించడమే ఫూలే దంపతులకు ఘనమైన నివాళి : మాజీ సీఎం కేసీఆర్‌

Advertisement
Update:2025-01-02 20:59 IST

ఫూలే దంపతుల స్ఫూర్తితోనే పదేళ్లు తెలంగాణలో సామాజిక ప్రగతి ప్రస్థానం కొనసాగిందని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ తెలిపారు. చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక సంప్రదాయ నిర్భంధాలను బద్దలుకొట్టి, బడుగుల అభ్యున్నతి, స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని కేసీఆర్‌ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయి ఫూలే అణచి వేయబడిన కులాలకు స్వేచ్ఛ, మహిళలకు విద్య కోసం ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మెజారిటీ ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా మార్పు చెందడానికి, వారి హక్కులు కాపాడబడటానికి, త్యాగాలు చేసిన భారతీయ మహనీయుల్లో మహాత్మా ఫూలే దంపతులు ముందువరుసలో ఉంటారని తెలిపారు.

మహాత్మా ఫూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యాచరణ నేడు ఫలితాలను అందిస్తున్నదని తెలిపారు. గురుకుల విద్య సహా, బడుగు వర్గాల బిడ్డలను భావితరాలకు ప్రతినిధులుగా తీర్చిదిద్దాలనే దార్శనికతతో విద్యారంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదిలో సావిత్రీ బాయి ఫూలే దంపతుల ఆశయాలు ఇమిడి ఉందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక గురుకులాలు స్థాపించామని తెలిపారు. వాటిని జూనియర్‌, డిగ్రీ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేసుకున్నామని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సబ్బండ వర్గాలలో నిత్య చైతన్యాన్ని నింపడం మాత్రమే సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయులకు మనమందించే ఘన నివాళి అన్నారు.

Tags:    
Advertisement

Similar News