హైదరాబాద్ లో టీడీపీ ఫ్లెక్సీలు.. సోషల్ మీడియా వార్

చంద్రబాబుకి తెలంగాణ పోలీసులు స్వాగతం పలుకుతున్నారని, వారే స్వయంగా బ్యానర్లు కడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై వెంటనే తెలంగాణ పోలీసులు స్పందించారు.

Advertisement
Update:2024-07-05 19:05 IST

ఏపీ సీఎం చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు.. ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గతంలో చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా హైదరాబాద్ లో ర్యాలీలకు అనుమతి నిరాకరించారని, ఇప్పుడు అదే నాయకుడికి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ సందడి చేస్తున్నారని అప్పటికి ఇప్పటికి పరిస్థితి చాలా మారిందని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనపడుతున్నాయి. చంద్రబాబు అభిమానులు ఓవైపు, హైదరాబాద్ లో ఏపీ సీఎం హడావిడి ఏంటని నిలదీసేవారు మరోవైపు.. రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి తెలంగాణ పోలీసులు స్వాగతం పలుకుతున్నారని, వారే స్వయంగా బ్యానర్లు కడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై వెంటనే తెలంగాణ పోలీసులు స్పందించారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డుపై పడిపోయిన ఫ్లెక్సీని తిరిగి యథాస్థానంలో నిలబెట్టే ప్రయత్నంలో ఆ వీడియో తీశారని, దానికి తప్పుడు వ్యాఖ్యానాలు జతచేస్తూ వైరల్ చేస్తున్నారని సమాధానమిచ్చారు తెలంగాణ పోలీసులు. తామేదో పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం చట్టరీత్యా నేరం అని హెచ్చరించారు. ట్రాఫిక్ కి ఇబ్బందుల కలగకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తాము ప్రయత్నం చేస్తుంటే, తమపై నిందలు వేయడం సరికాదంటూ పోలీస్ డిపార్ట్ మెంట్ వివరణ ఇచ్చింది.


రేపు(శనివారం) ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ జరగాల్సి ఉంది. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. భేటీ సంగతి పక్కనపెడితే చంద్రబాబుకి హైదరాబాద్ లో స్వాగతం పలుకుతూ హడావిడి ఎక్కువైందంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటున్నారు. దీంతో తెలంగాణలో పొలిటికల్ హడావిడి పెరిగింది.

Tags:    
Advertisement

Similar News