సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా.. డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్

న్యూఢిల్లీలో ఈ నెల 21, 22న 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌లెన్స్ అవార్డులను కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి అందించారు.

Advertisement
Update:2023-09-23 07:56 IST

తెలంగాణ ప్రభుత్వం పలు రంగాల్లో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నది. ముఖ్యంగా రాష్ట్ర ఐటీ రంగం సాధించిన ఘననీయమైన అభివృద్ధికి పలు అవార్డులు వరించాయి. ఐటీ శాఖకు అనుబంధంగా పని చేసే ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా కూడా పలు అవార్డులను గెలుచుకున్నది. తాజాగా ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఎక్స్‌లెన్స్ అవార్డులు తెలంగాణ డిజిటల్ మీడియాకు దక్కాయి. ఐదు విభాగాల్లో డిజిటల్ మీడియా అవార్డులు గెలుచుకోవడం విశేషం.

న్యూఢిల్లీలో ఈ నెల 21, 22న 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌లెన్స్ అవార్డులను కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి అందించారు. తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ కొణతం దిలీప్ 'సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నారు. ఆయన మాజీ మంత్రి అబ్బాస్ నఖ్వి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు. ఈ ఏడాదికి దిలీప్ కొణతం అవార్డును దక్కించుకున్నారు.

తెలంగాణ డిజిటల్ మీడియా విభాగానికి ఈ అవార్డుతో పాటు మరో నాలుగు అవార్డులు దక్కాయి. సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు, ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు, ప్రజా సేవల ప్రకటనల అవార్డు, ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్ అవార్డులు దక్కాయి.

ఐటీ శాఖ రూపొందించిన వార్షిక నివేదిక 2022-23కు ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు రాగా.. మన ట్యాంక్ బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం అనే ప్రకటనకు ప్రజా సేవల అవార్డు దక్కింది. ఇక కాళేశ్వరం తెలంగాణ జలవిప్లవం అనే వీడియోకు ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్ అవార్డు వరించింది. తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున అసిస్టెంట్ డైరెక్టర్ ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుండ్రెడ్డి ఈ అవార్డులను అందుకున్నారు.

Tags:    
Advertisement

Similar News