బండికి మళ్లీ సిట్ నోటీసులు.. ఈసారైనా వస్తాడా..?

సిట్ మరోసారి బండికి నోటీసులిచ్చింది. ఈనెల 26న విచారణకు రావాలని పిలిచింది. బండి ఆరోపణలు చేశారే కానీ, ఆధారాలివ్వమంటే మాత్రం వెనకడుగు వేస్తున్నారు.

Advertisement
Update:2023-03-25 11:20 IST

TSPSC ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు 13మందిని అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీపై ఆరోపణలు చేస్తున్న నాయకులకు సిట్ నోటీసులు పంపిస్తోంది. విచారణకు రావాలని, వారి వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని కోరింది. ఈ క్రమంలో బండి సంజయ్ కి కూడా గతంలోనే సిట్ నోటీసులు పంపించింది. 24వతేదీ విచారణకు రావాలని చెప్పింది. అయితే అసలు తనకు నోటీసులే రాలేదని, అందుకే తాను విచారణకు రావట్లేదని చెప్పారు బండి. అయినా పార్లమెంట్ సమావేశాలున్న సమయంలో తాను విచారణకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. దీంతో సిట్ మరోసారి బండికి నోటీసులిచ్చింది. ఈనెల 26న విచారణకు రావాలని పిలిచింది.

వస్తాడా..? రాడా..?

సిట్ విచారణ నుంచి తప్పించుకోడానికి బండి సంజయ్ గతంలోనే ఓ మెలిక పెట్టారు. సిట్‌ కి రెండు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. సిట్ పై తనకు విశ్వాసంలేదని తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వదలచుకోలేదని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తే సమాచారం ఇస్తామని ఆ లేఖలో స్పష్టంచేశారు. తనకు విశ్వాసం ఉన్న పరిశోధన సంస్థలకే సమాచారం ఇచ్చే హక్కు తనకు ఉందన్నారు సంజయ్. ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న సిట్‌ విచారణపై విశ్వాసం లేదంటున్నారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆయన విచారణకు వచ్చేది లేనిది స్పష్టంగా తెలియడంలేదు.

రేవంత్ రెడ్డి వ్యవహారం అయోమయం..

అటు రేవంత్ రెడ్డిని కూడా సిట్ విచారణకు పిలిపించింది. ఈనెల 23న సిట్ ముందు హాజరైన రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ సిట్ కి సమర్పించానన్నారు. కానీ అధికారులు మాత్రం ఆయన తమకు ఎలాంటి ఆధారాలివ్వలేదని చెబుతున్నారు. ఒకే మండలంలో 100 మందికి 100 మార్కులకు పైగా పోటీ పరీక్షల్లో వచ్చాయనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఆ ఆరోపణను రుజువు చేసేలా ఎలాంటి ఆధారాలు ఆయన చూపించలేదని, అందుకే న్యాయపరంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశముందని అంటున్నారు. ఇప్పుడు బండి కూడా ఆరోపణలు చేశారే కానీ, ఆధారాలివ్వమంటే మాత్రం వెనకడుగు వేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News