రంగులు మార్చే చీర.. ధర కేవలం రూ.2.80 లక్షలు

30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో రూపొందించిన ఈ చీరలో బంగారు, వెండి, లేత గులాబీ రంగులు కనిపిస్తుంటాయి. ఈ చీర పొడవు ఆరున్నర మీటర్లు. బరువు 600 గ్రాములు. తయారీకి నెలరోజుల సమయం పట్టింది.

Advertisement
Update:2023-09-26 09:13 IST

సిరిసిల్ల నేత కార్మికుల ప్రతిభ ఇది. రంగులు మార్చే చీరను తయారు చేశారు సిరిసిల్ల నేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్. గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీర, బంగారు చీర, వెండిపోగులతో చీర తయారు చేసిన విజయ్ ఇప్పుడు రంగులు మార్చే చీరను సృష్టించి అబ్బురపరిచారు. ఈ అద్భుతాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సెక్రటేరియట్ లో జరిగిన కార్యక్రమంలో ఈ చీరను ఆవిష్కరించిన మంత్రి.. నల్ల విజయ్ కుమార్ ప్రతిభను మెచ్చుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయాలని, తెలంగాణ ఘనతను చాటి చెప్పాలని ఆకాంక్షించారు.

రంగులు ఎలా మారుతుందంటే..?

బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో ఈ చీరను తయారు చేశాడు విజయ్ కుమార్. బంగారు, వెండి పోగులు ఉన్నాయి కాబట్టి ఈ చీర కేవలం చూడటానికే అనుకుంటే పొరపాటే. ఈ చీర కట్టుకున్నా కూడా అతివలకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. ఈ చీర కట్టుకుని నడుస్తుంటే చాలు.. అది కదులుతున్నప్పుడు రంగులు మారుతూ కనపడుతుంది. దీనికి కారణం బంగారు, వెండి, పట్టు పోగుల్ని అతి సున్నితంగా, చాకచక్యంగా మేళవించడం. కాంతి పరావర్తన ధర్మాన్ని కూడా అవగాహన చేసుకుని ఆ చీర నేయడం. నెలరోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీర తయారు చేశానంటున్నారు విజయ్.

ధర రూ.2.80 లక్షలు..

30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో రూపొందించిన ఈ చీరలో బంగారు, వెండి, లేత గులాబీ రంగులు కనిపిస్తుంటాయి. ఈ చీర పొడవు ఆరున్నర మీటర్లు. బరువు 600 గ్రాములు. తయారీకి నెలరోజుల సమయం పట్టింది. రంగులు మార్చే చీరను తయారు చేయడానికి దాదాపు 2.80 లక్షలు ఖర్చు అయిందని అంటున్నారు విజయ్ కుమార్. సిరిసిల్ల పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఆర్డర్ మేరకు ఈ చీర తయారు చేశానని చెప్పారు. కొత్తగా ఏ ప్రయోగం చేసినా, ముందు మంత్రి కేటీఆర్ కి చూపించడం విజయ్ కు అలవాటు. ఈ చీరను కూడా ముందుగా మంత్రికి చూపించి, ఆయన అభినందనలు పొంది మురిసిపోయాడు విజయ్. 

Tags:    
Advertisement

Similar News