సినిమా స్టైల్ బ్యాడ్ పోలీస్.. డ్రగ్స్ కేసులో ఎస్సై అరెస్ట్

గతంలో ఓ కేసులో బాధితుల దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు వేటు వేయగా, కోర్టుకి వెళ్లి మరీ ఆ ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నాడు రాజేందర్. తీరా ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు.

Advertisement
Update:2023-08-27 10:46 IST

సినిమాల్లో కొన్నిసార్లు పోలీసులనే విలన్లుగా చూపిస్తుంటారు. లేదా విలన్లతో చేతులు కలిపిన పోలీసుల్ని కూడా చూపిస్తుంటారు. సరిగ్గా తెలంగాణలో అలాంటి బ్యాడ్ పోలీసుని అదే డిపార్ట్ మెంట్ అరెస్ట్ చేసి కటకటాలవెనక్కు నెట్టింది. చూడటానికి సినిమా హీరోలా కనిపించే ఎస్సై రాజేందర్ ఇంత దగుల్బాజీ పనులు చేస్తాడా అని తెలుసుకుని డిపార్ట్ మెంట్ సిబ్బంది షాకయ్యారు.

పోలీసాఫీసర్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా మాంచి ఫిజిక్ తో హుందాగా కనిపిస్తాడు ఎస్సై రాజేందర్. కానీ అవినీతిలో అందెవేసిన చేయి. గతంలో ఓ కేసులో బాధితుల దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు వేటు వేయగా, కోర్టుకి వెళ్లి మరీ ఆ ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నాడు రాజేందర్. తీరా ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు, రాజేందర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు రాజేందర్. ఇటీవల హైదరాబాద్ డ్రగ్స్ దందా కేసు విచారణ కోసం మహారాష్ట్రకు వెళ్లిన టీమ్ లో రాజేందర్ కూడా ఉన్నాడు. ఆ సమయంలోనే పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన డ్రగ్స్ ని రాజేందర్ తెలివిగా తప్పించాడు. తన ఇంటిలో భద్రపరిచాడు, కోర్టులో ప్రవేశ పెట్టలేదు. సీక్రెట్ గా వాటిని అమ్మాలని చూశాడు. ఇంతలో రాయదుర్గం పోలీసులు ఆ డ్రగ్స్ డంప్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ని ఇంట్లోనే దాచి పెట్టిన రాజేందర్ చివరకు కటకటాల వెనక్కు వెళ్లక తప్పలేదు. సినిమా స్టైల్ లో జరిగిన ఈ ఎపిసోడ్ తెలంగాణ పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. 

Tags:    
Advertisement

Similar News