ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
మాజీ మంత్రి హరీశ్ రావు
రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు మంగళవారం కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, భువనగిరి ఎన్నికల ప్రచార సభలో బాధితులను ఆదుకుంటామని కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారని.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న.. ఓడ దాటినంక బోడి మల్లన్న చందంగా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 40 కి.మీ.లకు గాను 28 కి.మీ.లకు కుదించారని.. చౌటుప్పల్ వద్ద జంక్షన్ ఏర్పాటుతో మున్సిపాలిటీతో పాటు మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ట్రిపుల్ చౌటుప్పల్ మధ్యలో నుంచి పోతుండటంతో మున్సిపాలిటీ రెండుగా విడిపోతుందని, రెండు పంటలు పండే భూములతో పాటు ఎంతో మంది తమ ప్లాట్లు, ఇండ్లు కోల్పోతున్నారని తెలిపారు. చౌటుప్పల్ వద్ద గతంలో ప్రతిపాదించిన జంక్షన్ 78 ఎకరాల్లో ఉంటే, ఇప్పుడు 184 ఎకరాలకు పెంచారని, దీంతో ఎక్కువ మంది నష్టపోతున్నారని తెలిపారు. ట్రిపుల్ దక్షిణ భాగంలో మాదిరిగానే ఉత్తర భాగంలోనూ 40 కి.మీ.ల రోడ్డు వేసి రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్పు కోసం ధర్నాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు పోలీసులను మోహరించి, నిర్బంధంగా రోడ్డును 28 కి.మీ.లకే కుదించి రైతులతో ఒప్పంద పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఒకమాట చెప్పి ఇప్పుడు మాట మార్చడం ఎలా న్యాయమవుతుందని ప్రశ్నించారు. కోమటిరెడ్డికి మతిమరుపు ఎక్కువైనట్టు ఉందని, ఆయన మాట్లాడిన వీడియోలు పంపిస్తా చూసుకోవాలన్నారు. మంత్రిగా నల్గొండ జిల్లా ప్రజలకు న్యాయం చేయకపోతే చరిత్ర హీనుడిగా మిగులుతావని హెచ్చరించారు. రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ, తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ట్రిపుల్ ఆర్ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, వారి పక్షాన పోరాడుతుందని హామీ ఇచ్చారు.