షూటింగ్ లు, 'షో'లు రద్దు.. వర్మ ట్వీట్ పనిచేసినట్టేనా..?

సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత సినీ ఇండస్ట్రీ సంతాప సూచకంగా షూటింగ్ లు ఆపేసింది, విజయవాడలో థియేటర్స్ ఓనర్లు సినిమా ప్రదర్శనలు ఆపేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement
Update:2022-11-15 17:36 IST


సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. ఈ విషాదానికి సంతాపంగా బుధవారం విజయవాడ నగర వ్యాప్తంగా సినిమా మార్నింగ్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు. సినిమా అభిమానులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడతో సూపర్ స్టార్ కృష్ణకు మంచి అనుబంధం ఉందని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. ఆయన నటించిన సినిమాలను భార్య విజయనిర్మలతో కలిసి విజయవాడ వచ్చి తొలిరోజు థియేటర్లో చూసేవారని, అలాంటి వ్యక్తి లేరన్న విషయం తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

అటు తెలుగు చిత్ర నిర్మాతల మండలి కూడా వీరికి సంఘీభావం తెలిపింది. రేపు సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్ లు నిర్వహించట్లేదని నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది. సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా సినిమా కార్యకలాపాలన్నీ ఆపేస్తున్నట్టు వారు తెలిపారు.

వర్మ ట్వీట్ పనిచేసినట్టేనా..?

సినీరంగ ప్రముఖులు మరణిస్తే సంతాప సూచకంగా సినిమా షూటింగ్ లకు, సినిమా షో లకు సెలవు ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఇటీవల ఆ ఆనవాయితీని చాలామంది పట్టించుకోవడంలేదు. ఇటీవల కృష్ణంరాజు మరణం తర్వాత షూటింగ్ లకు సెలవు ఇవ్వలేదు. ఆయన మరణించిన రోజు కూడా తెలుగు సినిమాల చిత్రీకణలు జరిగాయి. ఎవరి పనుల్లో వారు బిజీబిజీ. అయితే దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ. గతంలో టికెట్ రేట్ల పెంపుకోసం, ప్రొడక్షన్ కాస్ట్ కటింగ్ విషయంలో చాలాసార్లు షూటింగ్ లు ఆగిపోయాయని, కానీ కృష్ణంరాజు మృతికి సంతాప సూచకంగా కనీసం ఒక్కరోజైనా విరామం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఇలాంటి స్వార్థపూరిత సినీ ఇండస్ట్రీకి ధన్యవాదాలంటూ సిగ్గు సిగ్గు అని ట్వీట్ చేశారు వర్మ. అప్పట్లో ఈ ట్వీట్ బాగా వైరల్ గా మారింది.


ఆ ట్వీట్ ప్రభావమో ఏమో తెలియదు కానీ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత సినీ ఇండస్ట్రీ సంతాప సూచకంగా షూటింగ్ లు ఆపేసింది, విజయవాడలో థియేటర్స్ ఓనర్లు సినిమా ప్రదర్శనలు ఆపేస్తున్నట్టు ప్రకటించారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఈ ప్రకటన రాగానే అందరు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కృష్ణ మరణంపై కూడా ఆయన తనదైన శైలిలో ట్వీట్ చేశారు. కృష్ణ మరణం పట్ల ఎవరూ బాధపడొద్దని, ఆయన స్వర్గంలో విజయ నిర్మలతో డ్యూయెట్లు పాడుకుంటూ ఉంటారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News