వైఎస్ షర్మిలకు బిగ్ షాక్..

వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది.

Advertisement
Update:2023-09-22 18:43 IST

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో పార్టీ పెట్టిన దగ్గరి నుంచి పెద్ద దిక్కుగా ఉన్న ఏపూరి సోమన్న పార్టీకి ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం తుంగతుర్తి నియోజవర్గం వైఎస్ఆర్టీపీ ఇంచార్జిగా ఉన్న సోమన్న శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలోనే తాను బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్‌కు సోమన్న తెలిపారు. కాగా, సోమన్న నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఏపూరి సోమన్న వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవన్ ఇతర నాయకులు ఉన్నారు.

వామపక్ష ఉద్యమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఒక కళాకారుడిగా ఏపూరి సోమన్న క్రియాశీలక పాత్ర పోషించారు. బహుజన యుద్దనౌకగా సోమన్నకు పేరున్నది. తెలంగాణ ఉద్యమ సాధన కోసం అనేక పాటలు పాడారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన సోమన్న.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ పార్టీ సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతలు నిర్వర్తించారు.

కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు రావడం లేదని భావించిన సోమన్న.. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీలో చేరారు. షర్మిలకు ప్రధాన అనుచరుడిగా ఉన్న సోమన్న.. ఆ పార్టీ కోసం అనేక పాటలు పాడారు. తుంగతుర్తి అభ్యర్థిగా ఏపూరి సోమన్ననే షర్మిల తన పార్టీ తరపున ప్రకటించారు. అయితే, కొద్ది రోజులుగా పార్టీని పట్టించుకోకుండా.. కాంగ్రెస్‌లో విలీనం చేయాలని షర్మిల నిర్ణయం తీసుకోవడంతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నచ్చకే బయటకు వచ్చిన తను.. మళ్లీ అదే పార్టీలోకి వెళ్లడం ఇష్టం లేక బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఏపూరి సోమన్న తన కోరికను శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి తెలియజేశారు. త్వరలోనే ఒక సభ నిర్వహించి.. అక్కడ సోమన్న పార్టీలో అధికారికంగా చేరతారని తెలుస్తున్నది. కాగా వైఎస్ఆర్టీపీలో గుర్తింపు ఉన్న ఏకైక నాయకుడిగా ఉన్న ఏపూరి సోమన్న పార్టీని వీడటంతో.. ఇప్పుడు షర్మిల ఏకాకిగా మిగిలిపోయారు.

బీజేపీకి గుడ్ బై చెప్పిన గద్వాల ఇంచార్జి వెంకటరెడ్డి..

గద్వాల జిల్లా బీజేపీ ఇంచార్జి వెంకట్ రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి, ఆయన భార్య శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. వెంకటరెడ్డి గద్వాల జిల్లాలో బీజేపీకి కీలక నాయకుడిగా ఉండగా.. ఆయన భార్య పద్మ జీహెచ్ఎంసీ బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. గత 40 ఏళ్లుగా బీజేపీలో ఉన్న వెంకటరెడ్డి కొంత కాలంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉన్నా.. కనీసం కలవడానికి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం బాధించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని.. ఆ పార్టీ గెలుపుకోసం పని చేస్తాయని వెంకటరెడ్డి దంపతులు చెప్పారు.



Tags:    
Advertisement

Similar News