రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా?

ప్రతిపక్షం చేసిన నానాయాగీ వల్ల అదానీకి రూ.100 తిరిగి ఇచ్చామని, ఇది రాష్ట్రానికి నష్టం అన్న సీఎం

Advertisement
Update:2024-12-21 14:07 IST

రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా విధివిధానాలపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

రైతు సమాజాన్ని ఆదుకోవడానికి మా ప్రభుత్వం ముందుంటుంది అన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రైతుకలు పెట్టుబడి సాయం ఇవ్వడానికి ఈ పథకాన్ని తెచ్చారు. సాగులో లేని భూములకూ రైతుబంధు ఇచ్చారు. దీనిద్వారా రూ. 22,600 కోట్ల ఆయాచిత లబ్ధి చేకూర్చారు. రియల్‌ ఎస్టేట్‌, పారిశ్రామికవేత్తలకూ ఇచ్చారు. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా? అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు.

జమీందార్లు, భూస్వాములకు రైతు బంధు ఇవ్వాలా? మీరు ఇచ్చారు కాబట్టి మమ్మల్నీ రాళ్లు, గుట్టలకు రైతు బంధు ఇవ్వాలంటున్నారు. బీఆర్‌ఎస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుంటే మేం కూడా ప్రతిపక్షంలోనే ఉండేవాళ్లం అన్నారు. 2023లో అధికారం.. 2024లో డిపాజిట్లు కోల్పోయిన మీరు మాకు ఆదర్శం కాదు. నిజమైన లబ్ధిదారులెవరికీ అన్యాయం జరగకూడదన్నారు.

రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నది. తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. బీఆర్‌ఎస్‌ పాలనలో 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు తగ్గించామని చెబుతున్నారు. అబద్ధాలు చెప్పే సంఘానికి అధ్యక్షుడు అసెంబ్లీకి రాలేదు. ఆ సంఘానికి ఉపాధ్యక్షుడు అసెంబ్లీకి వచ్చారు అని సీఎం ఎద్దేవా చేశారు.

స్కిల్‌ వర్సిటీ కోసం అదానీ రూ. 100 కోట్లు ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షం చేసిన నానాయాగీ వల్ల ఆ మొత్తాన్ని అదానీకి తిరిగి ఇచ్చాం. రూ. 100 కోట్లు తిరిగి ఇవ్వడం వల్ల రాష్ట్రానికి నష్టం అన్నారు. రెండు సార్లు సీఎం అయి.. వందేళ్ల విధ్వంసం చేసి.. వెయ్యేళ్లకు సరిపడా మీరు సంపాదించుకున్నారు అని సీఎం ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News